● రూ.1,39,100 అపరాధ రుసుం వసూలు ● డీటీవో శ్రీనివాసరావు
అమలాపురం రూరల్: వినాయక చవితి పండుగ సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత వారం రోజులుగా జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్టు డీటీవో దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 193 బస్సు లను తనిఖీ చేసి 61 బస్సులపై కేసులు నమోదు చేశామని, రూ.1,39,100 అపరాధ రుసుం విధించామని ఆయన శుక్రవారం పేర్కొన్నారు. ముమ్మిడివరం అన్నంపల్లి టోల్ ప్లాజా, రావులపాలెం ఈతకోట టోల్ ప్లాజాల వద్ద ఈ తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో ఎంవీఐలు రాజేంద్ర ప్రసాద్, రవికుమార్, ఓలేటి శ్రీనివాస్, సురేష్ కుమార్, షణ్ముఖ్ శ్రీనివాస్, కౌశిక్, వరప్రసాద్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు బాలిక అప్పగింత
తుని: ఇంటిలో ఎవరికీ చెప్పకుండా రైలులో వచ్చిన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఏడిబిల్లి భానును తుని జీఆర్పీ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. శుక్రవారం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు భాను విజయనగరం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కి జనరల్ భోగీలో కూర్చుంది. బెదురు చూపులు చూస్తున్న ఆమె గురించి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమెను కాకినాడ జిల్లా తునిలో దించి రైల్వే పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సమాచారం సేకరించారు. బాలిక తల్లి జానకి ఏఎన్‌ఎంగా పని చేస్తున్నట్టు గుర్తించి ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి తుని వచ్చిన తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో బాలికను అప్పగించారు.


