11 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కేసులు | - | Sakshi
Sakshi News home page

11 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కేసులు

Sep 14 2026 12:14 AM | Updated on Sep 14 2026 12:14 AM

రావులపాలెం: మండలంలోని ఈతకోట టోల్‌ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు ఆదివారం 28 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 11 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.26 వేలు అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఓలేటి శ్రీనివాస్‌, షణ్ముఖ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

అమలాపురం రూరల్‌: వినాయక చవితి సెలవు దినం కావడంతో ఈ నెల 14వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే జిల్లా స్ధాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వైఖోమ్‌ నిడియా దేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్‌, సచివాలయాల్లో జరిగే పీజీఆర్‌ఎస్‌లను సైతం రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

ఎస్పీ కార్యాలయంలోనూ..

అమలాపురం టౌన్‌: ఈ నెల 14వ తేదీ సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని వినాయక చవితి కారణంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా ప్రజలు గమనించాలని కోరింది.

మద్యం షాపుల లైసెన్స్‌

రెన్యువల్‌కు నోటిఫికేషన్‌

అమలాపురం టౌన్‌: జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులను 2026–27 సంవత్సరానికి పునరుద్ధరించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయిందని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి ఆర్‌ఎస్‌ కుమారీశ్వరన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 అక్టోబర్‌ ఒకటి నుంచి 2027 సెప్టెంబర్‌ 30 వరకు దుకాణాల పునరుద్ధరణ జరుగుతుందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ట్యాక్సులు చెల్లించి రెన్యువల్‌ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఓపెన్‌ కేటగిరీలోని 114 దుకాణాలతో పాటు గీత కులాలకు కేటాయించిన 21 దుకాణాలకు కూడా రెన్యువల్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ఎకై ్సజ్‌ అధికారికి దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

ఈఎన్‌టీ వైద్యుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా మూర్తి

కర్నూలు (హాస్పిటల్‌): ఈఎన్‌టీ వైద్యుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన డాక్టర్‌ జీఎస్‌ఎన్‌ మూర్తి ఎన్నికయ్యారు. ఏఓఐ ఏపీ కాన్‌–2026 పేరుతో మూడు రోజులుగా కర్నూలులో నిర్వహిస్తున్న 44వ ఈఎన్‌టీ వైద్యుల రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్‌ ఆదివారం ముగిసింది. ముందుగా సంఘ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం రెండేళ్లు. గత రెండేళ్లుగా అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్‌ బి.జయప్రకాష్‌రెడ్డి (కర్నూలు)ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక చైర్మన్‌ డాక్టర్‌ పి.హరికృష్ణ, కర్నూలు అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.మహేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈఎన్‌టీ వైద్యుల రాష్ట్ర కాన్ఫరెన్స్‌లో భాగంగా మూడోరోజు సీఎస్‌ఎఫ్‌ రైనోరియా సమగ్ర నిర్వహణ, మధ్య చెవిలో ఏర్పడే అసాధారణ చర్మపు పెరుగుదలను తొలగించే శస్త్రచికిత్సలపై శిక్షణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement