అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అయినవిల్లి గణపతీ.. ఆపదల నుంచి మమ్ము రక్షించు స్వామీ.. మా తొలి పూజ నికేనయ్యా.. అంటూ భక్తులు మొక్కారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ వంటి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. 2680 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. స్వామికి ఆదివారం ఒక్కరోజు రూ.3,29,751 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
వినాయక చవితికి ముస్తాబు
వినాయక చవితి సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 22 వరకు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు నిర్మించారు. విద్యుద్దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అన్నప్రసాదం తదితర ఏర్పాట్లు చేశారు. లక్ష కుంకుమార్చన, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, హారతులు తదితర కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.


