గండేపల్లి: స్నేహితులను మించిన అన్నదమ్ముల అనుబంధం వారిది. అప్పటివరకు కలిసే ఉన్న వారి బంధంపై విధికి కన్ను కుట్టిందేమో.. ప్రమాద రూపంలో వెంటాడి విడదీసింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో కళ్లముందే తమ్ముడు మృతిచెందడంతో అన్న పడిన వేదన వర్ణనాతీతం. ఇరవై రెండేళ్లు కలిసే ఉన్నాం కదరా.. నన్నొంటరిని చేసి వెళ్లిపోయావా తమ్ముడు.. అంటూ తోడబుట్టిన తమ్ముడి కోసం అన్న పడుతున్న వేదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. ఈ ప్రమాదంలో మణికట్టు తెగిపడి తానూ తీవ్ర గాయాలపాలైనప్పటికీ.. ఆ నొప్పిని భరిస్తూనే.. ‘నీకోసం అడిగితే.. అమ్మ నాన్నకు ఏం సమాధానం చెప్పాలిరా..’ అంటూ ఆ అన్న భోరున విలపించిన తీరు చూసి అంబులెన్స్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాగిత గ్రామానికి చెందిన రబ్బా రమణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రమణకు ఒక కుమార్తె, రబ్బా నవీన్, రబ్బా ప్రసాద్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. అన్నదమ్ములు ఇద్దరూ వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బైక్‌పై గత ఆరు వారాలుగా ప్రతి శనివారం వచ్చి వెళుతున్నారు. ఏడో వారమైన ఈ శనివారం కూడా వాడపల్లికి వచ్చిన వీరు దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరారు. సాయంత్రానికి మండలంలోని మురారి గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోకి వచ్చేసరికి ఇసుక లోడుతో ముందు వెళుతున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బైక్ హ్యాండిల్ లారీకి తగిలి అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ఘటనలో ప్రసాద్ నడుము భాగం పైనుంచి లారీ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ కుడి చెయ్యి లారీ చక్రాల కింద చిక్కుకుని మణికట్టు వరకు తెగిపడింది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి తరలించారు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ పోలీస్, హైవే సేఫ్టీ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ యూవీ శివనాగబాబు తెలిపారు.
నన్నొంటరిని చేశావా తమ్ముడూ?
22 ఏళ్లు కలిసే ఉన్నాం కదరా!
తీవ్రంగా గాయపడినా.. కళ్లముందే
తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న ఆక్రోశం
బైక్ అదుపుతప్పిన ఘటనలో
తమ్ముడు మృతి
మణికట్టు వరకు తెగిపడిన అన్న కుడి చెయ్యి
దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఘటన


