ఏసీబీ వలలో వీఆర్వో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో వీఆర్వో

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

రూ.16,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

ఆత్రేయపురం : మండలంలోని ర్యాలి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసిన రైతు లక్ష్మీ ప్రసన్న నుంచి రూ.16,500 లంచం డిమాండ్‌ చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం పక్కా ప్రణాళికతో దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరం ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ భవ్య కిషోర్‌ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ర్యాలి గ్రామానికి చెందిన బాధిత రైతు చిన్నం లక్ష్మీ ప్రసన్నకు సర్వే నంబర్‌ 381/6లో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు వీఆర్వో నాగేశ్వరరావు ఆమె నుంచి లంచం డిమాండ్‌ చేశారు. అందుకు అనుమతించిన లక్ష్మీ ప్రసన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి సూచన మేరకు శనివారం ర్యాలి గ్రామ సచివాలయంలో వీఆర్వోకు రూ.16,500 నగదు అందించారు. ఆ మొత్తాన్ని ఆయన తీసుకొని తన చొక్కా జేబులో పెట్టుకున్నారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భవ్యకిషోర్‌ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు వి.భాస్కరరావు, గోవిందరాజులు, వాసు కృష్ణ, సతీష్‌, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో నాగేశ్వరరావు స్వస్థలం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామ శివారు పాటిచెరువు. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అపార్ట్‌మెంట్‌లో సొంత ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆయన భార్య రాజమమేంద్రవరంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement