● మున్సిపల్ స్ధలాన్ని టీడీపీ జిల్లా
కార్యాలయానికి ఎలా కేటాయిస్తారు?
● ఈ లీజు రద్దు చేయాలి
● ఆ భూమిని తాగునీటి అవరాలకే వినియోగించాలి
● వైస్సార్ సీపీ నేత,
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్
అమలాపురం రూరల్: మున్సిపాలిటీ స్వయంగా కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన రెండెకరాల స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి అక్రమంగా దీర్ఘకాలిక లీజుకు ధారాదత్తం చేయడం కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగమేనని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ధ్వజమెత్తారు. ఈ లీజు కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భట్నవిల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పడి నాలుగేళ్లయినా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నిర్మించుకోవడానికి పట్టణంలో స్థలాలు కేటాయించలేని కూటమి ప్రభుత్వం.. మున్సిపల్ తాగునీటి అవరాల కోసం ఉద్దేశించిన భూమిని.. నిబంధనలకు విరుద్ధంగా అధికార టీడీపీ కార్యాలయానికి దీర్ఘకాలిక లీజుకు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికే పట్టణానికి చేర్చి ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా విస్తరించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు ప్రతిపాదనలు చేశారని గుర్తు చేశారు. పెరిగిన జనాభాకు తాగునీటి కొరత ఉందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను విస్తరించాల్సి ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న రెండెకరాల స్థలాన్ని దానికి కాకుండా టీడీపీ కార్యాలయానికి కేటాయించడమేమిటని ప్రశ్నించారు. ఈ కేటాయింపును తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ స్థలం కేటాయింపు వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
ఇది తగదు
వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే స్థలాలను రాజకీయ పార్టీ కార్యాలయాలకు కేటాయించడం తగదని, ఈ ప్రతిపాదనను వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని నాని మాట్లాడుతూ, 1999లో 43.75 ఎకరాల భూమిని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిమిత్తం కేటాయించారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బఫర్ జోన్‌లోని చెరువు భూమిని ఏ ఇతర అవసరాలకూ వినియోగించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. గ్రీన్ జోన్, బఫర్ జోన్‌లోని స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించరాదంటూ 2012లో 571 జీఓ ద్వారా తొమ్మిది శాఖల ప్రిన్సిపాల్ సెక్రటరీలు ఉత్తర్వులు ఇచ్చారని, ఈ విషయాన్ని ఆర్‌డీఓ సైతం గుర్తు చేశారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించేలా అధికారులపై ఒత్తిడి తెస్తోందని చెప్పారు. విలేకర్ల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సత్య నాగేంద్రమణి, యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షుడు దూడల ఫణీంద్ర, జిల్లా అధికారి ప్రతినిధి కాశి రామకృష్ణ నాయకులు యర్రంశెట్టి రామచంద్రరావు, కుంచె స్వామి ముత్తాబత్తుల సంతోష్, బళ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల క్షేమ సమాచారం ఊరటనిచ్చింది
ఓడలరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై, 23 రోజుల తర్వాత క్షేమంగా ఉన్నారనే సమాచారం తనకెంతో ఊరటనిచ్చిందని విశ్వరూప్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోయినా.. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ తరఫున బియ్యం, నిత్యావసర సరకులు అందజేసి, అండగా నిలిచామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాధిత కుటుంబ సభ్యులకు ఎటువంటి సాయం చేయకుండా, స్వీట్లు తినిపించి, దండలు వేసి, ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మత్స్యకారుల ఆచూకీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ,, క్షేత్ర స్థాయిలో బాధితులకు తోడుగా ఉన్న పార్టీ శ్రేణులకు ఆయన అభినందనాలు తెలిపారు.
మున్సిపల్ భూమిని టీడీపీకి ధారాదత్తం చేయడం దారుణం
అల్లవరం: అమలాపురం పట్టణ ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సిన మున్సిపల్ భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం దారుణమని మాజీ ఎంపీ చింతా అనురాధ శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తిని పార్టీ అవసరాలకు వినియోగించుకోవడం అధికార దుర్వినియోగమేనని స్పష్టం చేశారు. ప్రజలకు చెందిన ఆస్తి ఏ రాజకీయ పార్టీకీ సొంతం కాదని, దీనిని ప్రజావసరాలకు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. వెంటనే ఈ భూ కేటాయింపును పునఃపరిశీలించి, ఆ భూమిని తిరిగి మున్సిపాలిటీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను వదిలేసి పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజల తరఫున పోరాడుతుందని అనురాధ స్పష్టం చేశారు.


