● రైతులు కష్టాలు గట్టెక్కించాలి
● ఉమ్మడి ‘తూర్పు’ జెడ్పీ చివరి సమావేశంలో
జెడ్పీటీసీ సభ్యుల డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీరు సరిగ్గా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు అన్నారు. పంటలకు సాగునీరు సక్రమంగా అందించి అన్నదాతల కష్టాలు గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం స్థానిక జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతున్న అగచాట్లను ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌నినో ప్రభావంతో పంటలు పండించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
పంట కాలువలపై అక్రమ నిర్మాణాలా?
ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, పలు పంట కాలువలను ఆక్రమించి ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దీనివల సాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి అనుమతి ఎవరిచ్చారని అధికారులను నిలదీశారు. పంట కాలువలపై ఎటువంటి నిర్మాణాలకూ తాము అనుమతి ఇవ్వలేదని, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. రంపచోడవరం జెడ్పీటీసీ సభ్యురాలు పండ్ర వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం అసలు పంటలు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, రైతులకు సాగునీరు ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అసంపూర్తిగా జల్‌జీవన్ పనులు
జల్‌జీవన్ మిషన్ పథకంలో ఇంటింటికీ కుళాయిలు వేసేందుకు చేపట్టిన పైపులైన్ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆ పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారో చెప్పాలని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మతిన్ స్పందిస్తూ, కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని పనులను మధ్యలోనే నిలిపివేశారని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే వారికి బిల్లులు మంజూరు చేసి, పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పీహెచ్‌సీల్లో అందని సేవలు
పలు పీహెచ్‌సీల్లో సరైన వైద్యం అందించడం లేదని, సిబ్బంది, పూర్తి స్థాయిలో మందులు లేకపోవడంతో ప్రజలు కాకినాడ, రాజమహేంద్రవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టినా ప్రస్తుతం ప్రారంభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు.
గౌరవ వేతనాలు ఎప్పుడు?
తమకు రెండేళ్లుగా గౌరవ వేతనం చెల్లించడం లేదని, వెంటనే మంజూరు చేయాలని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. దీనిపై జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు స్పందిస్తూ, సభ్యులకు త్వరలోనే చెల్లించాల్సిన గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీల గౌరవ వేతనాన్ని ఆయా మండల పరిషత్‌ల నుంచి తీసుకోవాలని సూచించారు. అయితే, మండల పరిషత్ నిధుల నుంచి గౌరవ వేతనాలు ఇవ్వడానికి అనుమతులు లేవంటూ ఎంపీడీఓలు చెబుతున్నారని సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా..
గత ఐదేళ్లూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేశాం. 2021 నుంచి ఇప్పటి వరకూ 21 సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. జిల్లా అధికారులు, సభ్యుల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. మా పదవీ కాలం సెప్టెంబర్ 24 వరకూ ఉంది. త్వరలోనే సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్


