మత్స్యకారులను రక్షించిన వారికి కలెక్టర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులను రక్షించిన వారికి కలెక్టర్‌ అభినందనలు

Aug 29 2026 12:23 AM | Updated on Aug 29 2026 12:23 AM

అమలాపురం రూరల్‌: ఇటీవల సముద్రంలో గల్లంతైన ఓడలరేవు చెందిన ఏడుగురు మత్స్యకారులను కాపాడిన పశ్చిమ బెంగాల్‌ గోదావరి బార్మర్‌ బోర్డు ప్రతినిధులను కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ అభినందించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బార్మర్‌ బోర్డు ప్రతినిధులు పురుషోత్తం కుందూ, అరబిందో బుర్మాలను సత్కరించారు. సముద్రంలో ఆపదలో చిక్కుకున్న మత్స్యకారులను గుర్తించి సకాలంలో వారి ప్రాణాలను కాపాడటంలో చూపిన చొరవ, మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు. మత్స్యకారులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

అభ్యంతరాలుంటే

తెలియజేయండి ‘సర్‌’

అమలాపురం రూరల్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో అభ్యంతరాలుంటే వెంటనే సంబంధిత అధికారులకు నియోజకవర్గాల వారీగా తెలియజేయాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ సూచించారు. సర్‌ ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 21వ తేదీ నాటికి సర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని, తర్వాత తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైదియా దేవి, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కుడుపూడి శ్రీనివాసరావు, నల్లా పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అముడాలో చేరిన కొత్త

ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

అమలాపురం రూరల్‌: అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అముడా) పరిధిలో కొత్తగా చేరిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వైస్‌ చైర్‌పర్సన్‌, జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైదియాదేవి అన్నారు. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు 19 మండలాలకు అముడా పరిధిని విస్తరించిన నేపథ్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగా చేరిన గ్రామ పంచాయతీల్లో పరిపాలన, పట్టణాభివృద్ధి కార్యకలాపాలను సమన్వయంతో నిర్వహించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతులు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ, అముడా పరిధిలో అమలయ్యే నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. అముడా చైర్మన్‌ అల్లాడ స్వామి నాయుడు కూడా పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి

రామచంద్రపురం రూరల్‌: 2011 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నుంచి మినహాయింపునివ్వాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రామచంద్రపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్పెషల్‌ టెట్‌ అని ప్రభుత్వం చెబుతున్నా అందులో స్పెషల్‌ ఏమీ లేదని విమర్శించారు. టెట్‌లో అందరికీ ఉత్తీర్ణత 40 శాతం మార్కులకు కుదించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని, బోధించే సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ పైనే పరీక్షలుండాలని సూచించారు. దీనితో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పీఆర్‌సీ, ఆర్థిక బకాయిల చెల్లింపులు చేపట్టాలని, తక్షణం ఐఆర్‌ ప్రకటించాలని, పీఆర్‌సీ కమిషన్‌ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు మాగాపు ప్రదీప్‌ కుమార్‌, ఎం.సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

పీ–4ను మరింత బలోపేతం చేయాలి

అమలాపురం రూరల్‌: పేదలను ప్రగతి వైపు నడిపించేందుకు ఉద్దేశించిన పబ్లిక్‌–ప్రైవేట్‌–పీపుల్‌–పార్ట్‌నర్‌షిప్‌ (పీ4) కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ మార్గదర్శకులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గంలో పీ–4 కార్యక్రమం అమలు గురించి వివరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైదియాదేవి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మురళీకృష్ణ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement