● అన్నవరంలో నిత్యాన్నదానం
● చల్లారితే తినలేని పరిస్థితి
● బియ్యం నాణ్యతపై అనుమానాలు
● ప్రతిరోజూ 5 వేల మందికి భోజనం
అన్నవరం: సత్యదేవుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకంలో భోజనంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో భోజనం బాగుండేదని, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అన్నం వేడిగా ఉన్నప్పుడు తప్ప, వేడి తగ్గితే తినలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కూరలు, పప్పు, సాంబారు కూడా చాలాసార్లు బాగోవడం లేదంటున్నారు. అన్నదాన విభాగంలో ఒకప్పుడు చేయితిరిగిన వంటవారు ఉండేవారు. వారందరూ ఉద్యోగ విరమణ చేశాక తాత్కాలిక పద్ధతిపై పనిచేసేవారే కొనసాగుతున్నారు. వారు కూడా కేవలం ఆరుగురే ఉండటం, వారికి అంతగా అనుభవం లేకపోవడం కూడా ఆహార పదార్థాల నాణ్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ప్రతి రోజూ సుమారు ఐదు వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
రూ.69 కోట్లకు అన్నదానం డిపాజిట్లు
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన విరాళాల డిపాజిట్లు రూ.69 కోట్లకు చేరాయి. వీటిపై ఏటా వచ్చే వడ్డీ రూ.4 కోట్లు. ఇక ఒక భోజనం తయారీకి రూ.39 వ్యయం అవుతుందని అంచనా. భోజనంలో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదంతో పాటు పులిహోర, అన్నం, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ వడ్డిస్తారు.
ఇవీ ఇబ్బందులు
నిత్యాన్నదానంలో వినియోగించే బాయిల్డ్ రైస్‌ను ఒక ప్రముఖ బియ్యం విక్రయ సంస్థ టెండర్ ద్వారా కేజీ రూ.42కు సరఫరా చేస్తోంది. తక్కువ నాణ్యత కలిగిన బియ్యాన్ని బాయిల్డ్ రైస్ అని చెప్పి సరఫరా చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేయించి సరఫరా చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ బియ్యం కొంత ఎక్కువ సేపు ఉడికితే జావ అయిపోవడం, తక్కువ ఉడికితే పలుకుగా ఉండటం జరుగుతోంది. దీంతో వేడిగా ఉంటే తప్ప ఈ అన్నం తినలేకపోతున్నామని భక్తులు చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటాం : ఈవో
ఈ విషయాన్ని దేవస్థాన ఈవో ఎన్.సూర్యచక్రధరరావు దృష్టికి తీసుకెళ్లగా అన్నదాన పథకం అమలు తీరుపై దాదాపు ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నానని చెప్పారు. భోజనం నాణ్యంగానే ఉందని భక్తులు చెబుతున్నారని, ఇంకా బాగుండేలా తగు చర్యలు తీసుకుంటానన్నారు. సాంబారు, పచ్చడి తయారీకి అవసరమైన కొబ్బరి ముక్కలు కాంట్రాక్టర్ ఇచ్చేలా తదుపరి టెండర్‌లో షరతు పెడతామన్నారు.
రుచి లేక..
గతంలో సాంబారులో కొబ్బరి కోరు వేసేవారు. కొబ్బరి పచ్చడి కూడా వడ్డించేవారు. గతంలో దేవస్థానంలో వ్రతాల్లో భక్తులు కొట్టిన కొబ్బరి ముక్కలు తీసుకునే కాంట్రాక్టర్ అన్నదానం పథకానికి అవసరమైనన్ని కొబ్బరి ముక్కలు సరఫరా చేయాలనే నిబంధన ఉండేది. గతేడాది ఈ నిబంధన తీసేసి టెండర్ కం వేలం నిర్వహించారు. దీనివల్ల అన్నదాన పథకానికి కొబ్బరి ముక్కలు రాకపోవడంతో సాంబారు, పచ్చడిలో కొబ్బరి లేక అవి రుచిగా ఉండడం లేదు. గురువారం అన్నదానంలో భోజనం చేసిన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ కూడా సాంబారు రుచి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంబారును మరింత చిక్కగా, రుచిగా తయారు చేయాలని ఆదేశించారు. అలాగే క్యూలైన్‌లో వేచివుండే భక్తులు కూర్చునే సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు.


