● పెరిగిన ఉల్లిపాయల ధర
● ఇతర కూరగాయలదీ అదే దారి
● సామాన్య ప్రజల అవస్థలు
తాళ్లపూడి: సాధారణంగా ఉల్లిపాయలు కోసినప్పుడు మన కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. అది సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ ఇప్పుడు పెరిగిన ధరలతో ఉల్లిపాయలను కొనాలంటేనే కన్నీరు వస్తోంది. ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కూరగాయల రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, స్థానిక సంతలలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల మొదటి వారంలో నాణ్యమైన ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉండగా, ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.45 నుంచి రూ.50కి పైనే చేరింది. చిరు వ్యాపారులు ఆటోలపై ఇళ్ల వద్దకు వచ్చి విక్రయించే కొంచెం నాసిరకం ఉల్లిపాయలను మూడు కిలోలు రూ.100కు ఇస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించిన ప్రకతి వైపరీత్యాలతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తి వేశారు. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి.
ధరల నియంత్రణ ఎక్కడ?
ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో పాటు నాఫెడ్‌లోని ఉల్లి నిల్వలను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మార్కెట్లలో అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.45 నుంచి రూ.50, పచ్చిమిర్చి రూ.50, బీరకాయ, రూ.50, ఆకాకర రూ.160, టమాటా, బెండ, దొండ రూ.30, బీన్స్ రూ.150, క్యారెట్, బీట్‌రూట్, తెల్లవంకాయలు రూ.50, అల్లం రూ.120 పలుకుతున్నాయి. మరోవైపు ఆకుకూరలు, కొత్తి మీర ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.


