నా భర్తను చంపేశాడు! | - | Sakshi
Sakshi News home page

నా భర్తను చంపేశాడు!

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

మీనా, సౌజన్యల ఆచూకీ కోసం

గోదావరి నదిలో గాలింపు

వెలుగులోకి పిఠాపురం

ఏఈ కుమార్తె లేఖలు

నూకరాజు కుటుంబం

ఆత్మహత్య కేసులో కీలక మలుపు

పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్‌ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న షేక్‌ సాధిక్‌ ఖాన్‌.. తన కుటుంబానికి సహాయం చేస్తున్నట్టుగా నటించి, తమను హింసించాడని, తన భర్తను హత్య చేశాడని, తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడంటూ నూకరాజు కుమార్తె రాసినట్లు చెబుతున్న లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సాధిక్‌ ఖాన్‌ వేధింపులు భరించలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి కలసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి ఆదివారం రాత్రి గోదావరి నదిలో దూకిన విషయం తెలిసిందే. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమ వారం రాత్రి లభ్యం కాగా.. మీనా, సౌజన్యల ఆచూకీ మంగళవారం సాయంత్రానికి కూడా లభించలేదు. వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు.

సాధిక్‌ ఖాన్‌పై మరో ఫిర్యాదు

తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు సాధిక్‌ ఖాన్‌ కారణమంటూ నూకరాజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాధిక్‌ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అతడిపై తాజాగా హత్య కేసు కూడా నమోదైంది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి సాధిక్‌ ఖాన్‌ పాయిజన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి, హత్య చేశాడంటూ నూకరాజు వియ్యంకుడు, సౌజన్య మామ భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాధిక్‌ ఖాన్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్‌ రాజు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరరెడ్డి హత్యలో ఉన్న మరో వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు.

‘నన్ను బెదిరించాడు’

నూకరాజు మనవడు కార్తికేయరెడ్డితో పాటు తన కోడలు సౌజన్య స్కూటీలో ఆధారాలున్నాయంటూ భాస్కరరెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆమె స్కూటీని తనిఖీ చేసి మూడు కవర్లను గుర్తించారు. వాటిలో తన భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. సాధిక్‌ ఖాన్‌ తనను బెదిరించి, తన ఆస్తిని, ఫోన్‌, ఏటీఎం కార్డులు, బ్యాంకు లాకరు వివరాలన్నీ తీసుకున్నాడని, చివరకు తన భర్తను పాయిజన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేశాడని, మాట వినకపోతే తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అతడి బెదిరింపులు, వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.

చనిపోవాలని ముందే నిర్ణయం!

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన కారు డ్రైవర్‌ రాజును రాజమహేంద్రవరం ప్రకాశ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి, పలు ఆధారాలు సేకరించారు. సాధిక్‌ ఖాన్‌ వేధింపులు అధికం కావడంతో తాళలేక చనిపోవాలని నూకరాజు కుటుంబం ముందే నిర్ణయించుకుందని, దీనికి ఆదివారం ఉదయం ప్లాన్‌ వేసుకుందని సమాచారం. ఈ క్రమంలో కారు డ్రైవర్‌ రాజును ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి రావాలని నూకరాజు చెప్పారు. ఆలోగా ఆస్తిపత్రాలన్నీ తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. ఇంటికి వచ్చిన డ్రైవర్‌ రాజుకు ఆస్తి డాక్యుమెంట్లు ఇచ్చి, తమ సమీప బంధువు మహేష్‌కు ఇవ్వాలని పంపించారు. డ్రైవర్‌ ఆ పని పూర్తి చేసుకుని వచ్చిన తరువాత ఆదివారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. డ్రైవర్‌ రాజు ద్వారా రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో టిఫిన్లు తెప్పించుకున్నారు. అనంతరం, కారులో కొవ్వూరు చేరుకుని, డ్రైవర్‌ రాజుకు కొంత డబ్బులు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పారు. ఆ తర్వాత నూకరాజు కుమార్తె సౌజన్య కారు నడుపుతూండగా.. గంటకు పైగా కొవ్వూరు, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి సమీపంలో తిరిగారు. సరిగ్గా 88వ నంబర్‌ పిల్లర్‌ వద్దకు వచ్చి, కారు దిగి, గోదావరిలో దూకేశారు. నూకరాజు మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement