అమలాపురం రూరల్: ఓడలరేవు తీరం నుంచి ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి, గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ మత్స్యకారులు తీరం నుంచి సముద్రంలో సుమారు 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, మైరెన్ పోలీస్, సివిల్ పోలీస్, మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో ముమ్మంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, గాలింపు పరిధిని విస్తరించారని వివరించారు. కాకినాడ, విశాఖపట్నం పరిధిలోని కోస్ట్‌గార్డ్ నౌకలకు, ఇతర మత్స్యకార బోట్లకు ఆ బోటుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేసి, అప్రమత్తం చేశామని తెలిపారు. ఆ మత్స్యకారులు ఈ నెల ఐదో తేదీ వరకూ వారి కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడారని, అనంతరం వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. బోటులో వీహెచ్‌ఎఫ్ సెట్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌పాండర్ లేదని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఈశాన్య లేదా వాయవ్య దిశగా వేటకు వెళ్లే అవకాశం ఉన్నందున కాకినాడ, ఉప్పాడ తదితర తీర ప్రాంతాల్లోని మత్స్యకార సంఘాలను, ఆయా జిల్లాల మత్స్యశాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, మత్స్యకారుల గల్లంతుపై అల్లవరం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశామని చెప్పారు. మత్స్యకారుల ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్‌డేటా రికార్డులు, అందుబాటులో ఉన్న ఇతర సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వారి ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని కోరారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. విలేకర్ల సమావేశంలో మత్స్య శాఖ ఏడీ కరుణాకర్ కూడా పాల్గొన్నారు.
గాలింపు చర్యలు మరింత
వేగవంతం చేయాలి
అల్లవరం: చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన మత్స్యకారులను గుర్తించేందుకు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేయాలని మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మత్స్యకారులు 16 రోజులైనా తీరానికి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఓడలరేవులోని బాధిత కుటుంబాలను మంగళవారం ఆమె పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని అనురాధ తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిత్యవసరాలు అందించారు. ఆమె వెంట ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ, సీనియర్ నాయకులు మల్లాడి ఉమామహేశ్వరరావు, చిలకలపూడి ఏసు, మల్లాడి భాను తదితరులున్నారు.
మున్సిపాలిటీలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు చర్యలు
అమలాపురం రూరల్: విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు మున్సిపాలిటీ పరిధిలో సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోందని అధికారులు వివరించారు. ప్రతి నెలా సుమారు రూ.11 లక్షల విద్యుత్ బిల్లు అవుతోందని, ఈ భారాన్ని తగ్గించేందుకు ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. మొదటి దశలో నడిపూడి రా వాటర్ వర్క్స్ వద్ద 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. రెండో దశలో ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ ఆస్తులపై మరో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ కె.రాంబాబు, సోలార్ ఆస్ట్రిచ్ సీఈఓ రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎం కె.పృథ్వీరాజ్, ఏపీ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బి.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


