ప్రభుత్వమే బాధ్యత వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

అల్లవరం ఓడలరేవు తీరం నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ ఇప్పటి వరకూ తెలియకపోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీ వరకూ తుపాను హెచ్చరికలున్నాయని, దీనిపై మత్స్యకారులకు సరైన సమాచారం అందించడంతో పాటు సమర్థవంతంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నా. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతోనే ఇటువంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, తాజా సంఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఇకనైనా స్పందించి నేవీ, కోస్ట్‌గార్డ్‌, మైరెన్‌, మత్స్యశాఖల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని, అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీని సాధ్యమైనంత త్వరగా కనుక్కోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత మత్స్యకార కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వారి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఇజ్రాయిల్‌ తెలిపారు.

వాడపల్లి వెంకన్నకు రూ.72 లక్షల

కాసులపేరు సమర్పణ

ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదానానికి చెరుకువాడ సంతోష్‌ కుమార్‌ రాజు, కీర్తి దంపతులు (కై కలూరు) మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. అలాగే, మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ మైనింగ్‌ ఇండియా సంస్థ నిర్వాహకులు తెల్ల శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు (విశాఖపట్నం) సుమారు రూ.72 లక్షల విలువైన 464 గ్రాముల బంగారు కాసులపేరు సమర్పించారు. స్వామివారిని దర్శించిన అనంతరం దాతలకు అర్చకులు, పండితులు వేదాశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాలను ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందించారు.

గాలింపు చర్యలు

వేగవంతం చేయాలి

అల్లవరం: చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన మత్స్యకారులను గుర్తించేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మత్స్యకారులు 16 రోజులైనా తీరానికి రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఓడలరేవులోని బాధిత కుటుంబాలను మంగళవారం ఆమె పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతామని అనురాధ తెలిపారు. ఆమె వెంట ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ, సీనియర్‌ నాయకులు మల్లాడి ఉమామహేశ్వరరావు, చిలకలపూడి ఏసు, మల్లాడి భాను తదితరులున్నారు.

హోంగార్డుల సమస్యల

పరిష్కారానికి కృషి

అమలాపురం టౌన్‌: హోంగార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని విశాఖపట్నం హోంగార్డ్స్‌ రీజియన్‌ కమాండెంట్‌ ఎ.జోషి అన్నారు. స్థానిక బాలయోగి స్టేడియంలో మంగళవారం జరిగిన పరేడ్‌లో హోంగార్డుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించి, ప్రసంగించారు. జిల్లా హోంగార్డు కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. హోంగార్డులకు బీమా వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించారు. అనంతరం, ఎస్పీ రాహుల్‌ మీనాను ఆయన కార్యాలయంలో కమాండెంట్‌ జోషి మర్యాదపూర్వకంగా కలుసుకుని, హోంగార్డుల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో రాజమహేంద్రవరం హోంగార్డ్స్‌ డీఎస్పీ కె.రెడ్డప్ప, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) డీఎస్పీ సుబ్బరాజు, ఏఆర్‌ హోంగార్డ్స్‌ ఆర్‌ఐ ఎన్‌.బ్రహ్మానందం, హోంగార్డ్స్‌ ఏఆర్‌ ఎస్సై కేవీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement