● అక్రమ కేసులపై న్యాయ పోరాటం
● తమ్మన కుటుంబ సభ్యులకు పరామర్శ
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి
ఆలమూరు: కార్యకర్తలను హింసిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు. మండలంలోని చెముడులంకలోని పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో భయపెట్టేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌గా చెముడులంక గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, అందరి అభిమానాలూ చూరగొన్న తమ్మనను నిరాధార ఆరోపణలతో అక్రమంగా అరెస్తు చేయడంపై మండిపడ్డారు. బడుగువానిలంక, మూలస్థాన అగ్రహారం వంతెనల పేర్ల విషయంలో ప్రజాభిప్రాయం మేరకు ప్రశ్నించేనందుకే తమ్మనపై కూటమి నేతలు కక్ష పెంచుకున్నారని అన్నారు. తనపై గతంలో ఏడెనిమిది కేసులు పెట్టినా, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కక్షతో ఎప్పుడూ ఒక్క కేసు కూడా పెట్టించలేదని గుర్తు చేశారు. రాజకీయాలుంటే తనతో చేయాలని, తన కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం హుందాతనం కాదని హితవు పలికారు. కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులతో కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకంతో తమ్మన కూడా ధైర్యంగా చట్టం ముందు నిలబడ్డారని ఆయనన్నారు,
తమ్మన కుటుంబానికి అండగా ఉంటాం
కూటమి నేతలు అక్రమంగా అరెస్టు చేయించిన తమ్మన శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగ్గిరెడ్డి భరోసా ఇచ్చారు. తన సోదరి కె.శైలజ, భార్య లావణ్యతో కలసి తమ్మన నివాసానికి వెళ్లి, ఆయన భార్య, ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ్మనకు పార్టీ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అక్రమ అరెస్టుపై పైకోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని, బెయిల్ కోసం చట్టపరమైన అన్ని మార్గాలనూ అనుసరిస్తామని చెప్పారు. తమ్మన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు గొల్లపల్లి డేవిడ్‌రాజు, చల్లా ప్రభాకరరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, నెక్కంటి వెంకట్రాయుడు, నామాల శ్రీనివాస్, చల్లా వెంకట సుబ్రహ్మణ్యం, నాండ్ర నాగమోహన్‌రెడ్డి, ఎంీపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యురాలు తోరాటి సీతామహాలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తమ్మనతో ములాఖత్
అక్రమ కేసులో అరెస్టయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న తమ్మన శ్రీనివాస్‌తో జగ్గిరెడ్డి ములాఖత్ అయ్యారు. తమ్మన కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అధైర్యపడవద్దని, ఆయనకు, కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జగ్గిరెడ్డి భరోసా ఇచ్చారు.


