అమలాపురం రూరల్: జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్, మీకోసం రెవెన్యూ క్లినిక్‌లను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సోమవారం పిచ్చుకలంకలో సీఎం పర్యటన సందర్బంగా జిల్లా అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో దిగువ స్థాయి, ఇతర అధికారులు పీజీఆర్‌ఎస్‌కు వస్తారన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, తదితర వివరాల కోసం 1100 టోల్ నంబరుకు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
చినవెంకన్న సన్నిధిలో
హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: స్థానిక చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఏఈవో మెట్టపల్లి దుర్గారావు స్వామివారి చిత్ర పటాన్ని ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు తదితరులున్నారు.
చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం
నిడదవోలు: స్ధానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరగుతున్న రాష్ట్రస్థాయి మహిళల చదరంగం పోటీలు ఆదివారంతో ముగిసాయి. ప్రధమ స్థానంలో త్రిపురాంబిక (తిరుపతి) రెండో స్థానం వి.మోహిత (గుంటూరు), మూడో స్థానం సీహెచ్ వైష్ణవి (గుంటూరు), నాలుగో స్థానంలో జి.హిమ తేజస్విని (నెల్లూరు)నిలిచారు. వాసవీ జిల్లా గవర్నర్ కేదర్శెట్టి రవికుమార్, వాసవియన్ గోల్డెన్ స్టార్ నూలి వెంకటరమణమూర్తిలు గెలుపొందిన విజేతలకు బహుమతి అందజేశారు.
నేటి నుంచి కౌన్సెలింగ్
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి 14వ తేదీ వరకు (రూల్ ఆఫ్ రిజర్వేషన్), 15వ తేదీ (జనరల్ పూల్) రాజమహేంద్రవరంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు ధ్రువపత్రాలు ఒరిజినల్, జెరాక్స్ కాపీలతో రావాలని ప్రిన్సిపాల్ సునీల్‌కుమార్ పేర్కొన్నారు.


