కాకినాడ వేదికగా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ వేదికగా బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ అవ్వడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు ప్రభుత్వం నుంచి, పాలకుల నుంచి అనేక అక్రమ పోలీసు కేసులు, వేధింపులు ఎదుర్కొంటున్నా లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అగ్ర నేతలు మొదలుకుని ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు ఉత్తుంగ తరంగాలై కాకినాడ తరలివచ్చారు. సమావేశానికి హాజరయ్యే వారి కోసం కాకినాడ సినిమా రోడ్డులోని సూర్యకళామందిర్‌లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ నేతలు క్యూ కట్టారు. కార్యవర్గ సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన అరగంటలోనే సమావేశ మందిరం సూర్యకళామందిర్ పార్టీ నేతలు, శ్రేణులతో నిండిపోయింది. కూర్చునేందుకు వీలులేక వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ దళిత నేతలు హాలు బయటే ఉండిపోయారు. సమావేశం ప్రారంభమైన ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడు గంటలకు ముగిసే వరకు పార్టీ శ్రేణులు శ్రద్ధగా ముఖ్యనేతల ప్రసంగాలను ఆలకించారు.
అధికార పార్టీ దౌర్జన్యాలను
తూర్పార బట్టిన నేతలు
కాకినాడ వేదికగా జరిగిన సమావేశంలో వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న దళితులపై చంద్రబాబు ప్రభుత్వంలో సాగిస్తున్న వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ పోలీసు కేసులు, హత్యలు, అత్యాచారాలపై నేతలు ఉదాహరణలతో సహా కడిగి పారేశారు. మాల, మాదిగలను విడదీసి రాజ్యాధికారానికి దూరం చేసిన చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని జూపూడి, సుధాకర్‌బాబు వంటి నేతలు పిలుపు ఇచ్చినప్పుడు పార్టీ ఎస్సీ సెల్ నేతల నుంచి మంచి స్పందన లభించింది. రాజధాని అమరావతిలో భూములు లాగేసుకుని దళితులను వెళ్లగొట్టే కుట్రల దగ్గర నుంచి వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతోన్న అధికార పార్టీ నేతల తీరును నేతలు తూర్పార బట్టారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు గ్రామ, గ్రామాన దళిత వర్గాలకు అవగాహన కల్పించాల్సి అవసరాన్ని పార్టీ నేతలు నూరిపోశారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా దళితులకు కల్పించిన ప్రయోజనాలు గణాంకాలతో సహా వివరించిన నేతలు ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన సందర్భంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు జై జగన్, 2029లో జగనే సీఎం అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఇందుకోసం అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఎన్ని కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మీ వెంట ఉంటామంటూ నేతలు కొండంత ధైర్యాన్నిచ్చారు. ఇందుకోసం దళితులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
అంబేడ్కర్ విగ్రహానికి అవమానాలపై ఆగ్రహం
దళితుల జోలికొస్తే ఏం జరుగుతుందో సర్కార్‌కు తెలిసొచ్చేలా చేస్తామంటూ కార్యవర్గ సమావేశం డిక్లరేషన్‌లో చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చారు. అమరావతి రాజధానిని కుల రాజధానిగా చేసిన వైనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అవగాహన కల్పించే విషయంలో పార్టీ శ్రేణులంతా చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా నేతలు తమ ప్రసంగాల్లో సూటిగా తెలియచేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో విజయవాడ స్వరాజ్ మైదానంలో జగన్ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వంలో జరుగుతోన్న అవమానాలపై పార్టీ నేతలు ఒకే గొంతుకై నిరసించారు. సంపన్నులకు కాకుండా సామాన్యులైన దళితులకు జగన్‌మోహన్‌రెడ్డి కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని జూపూడి, మేరుగు నాగార్జున్, తాటిపర్తి చంద్రశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్ వంటి నాయకులు వివరించే సందర్భంలో సూర్యకళామందిర్‌లో పార్టీ శ్రేణులు జై జగన్ నినాదాలు మిన్నంటాయి.
సరికొత్త ఉత్తేజం
దశాబ్దన్నర కాలం క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో పార్టీ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని ప్రకటించారు. ఈ అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమై 15 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒక రోజు ముందు కాకినాడలో పార్టీ ఎస్సీ సెల్ సమావేశం జరగడం పార్టీ భవిష్యత్‌కు శుభసంకేతమంటూ నేతలు చర్చించుకోవడం కనిపించింది. నాడు పార్టీ జెండా, అజెండా ఇదే జిల్లా నుంచి ఆవిష్కృతం కావడాన్ని పార్టీ నేతలు ప్రస్తావించి పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపారు. పార్టీ కార్యవర్గ సమావేశం చివర్లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో కొత్తగా ‘జగనన్నకు తోడుగా–రాజన్న రాజ్యం మళ్లీ సాధిద్దాం’, ‘జగనన్న దళిత ఫోర్స్–దళిత జాతి మేలుకో’ అంటూ రూపొందించిన గీతం ఆహూతులైన పార్టీ శ్రేణులను అలరించింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు ఈ గీతాన్ని ఆవిష్కరించినదే తడవుగా పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఊగిపోయారు. శ్రేణులు ఉత్సాహంతో పార్టీ కండువాలతో గీతానికి లయబద్ధంగా నృత్యాలు చేశారు. మొత్తంగా పార్టీ ఎస్సీ సెల్ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
శ్రేణుల్లో ఉత్సాహాన్ని
నింపిన నేతల ప్రసంగాలు
కదలి వచ్చిన దళిత లోకం
అక్రమాలు, దౌర్జన్యాలపై పోరుబాటే..
2029లో జగన్‌ను
సీఎం చేయడమే అజెండా
దళితులపై దౌర్జన్యాలు
పెరిగిపోయాయి
ఎస్సీలు వైఎస్సార్‌సీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ సమావేశంలో బడుగు, బలహీన వర్గాలు కోసం ఎన్నో తీర్మానాలు చేయడం శుభపరిణామం. వైఎస్సార్ సీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు మారాయి. బాబు పాలనలో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. దళితులపై దౌర్జన్యాలు పెరిగాపోయాయి. ప్రజలు ఈ విషయం నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి , ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించి దళితుల స్థితిగతులు మార్చారు. అందుకే ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని మూసివేసి దళిత విద్యార్థులకు అన్యాయం చేసింది.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
సంక్షేమాన్ని విస్మరించిన ‘బాబు’
రాష్ట్రంలో అధికారం పోతే ప్రతిపక్షం మూడు సంవత్సరాల వరకూ రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రోడ్డుమీదకు వచ్చి ప్రజలు తరఫున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్సీలు వైఎస్సార్ సీపీకి వెన్నెముక లాంటివారు. వైఎస్సార్ సీపీకి గత ఎన్నికల్లో అధిక శాతం ఓటుబ్యాంకు ఎస్సీల ద్వారానే వచ్చింది. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. కాగా రూ.99లకు విశాఖ నడిబొడ్డున కార్పొరేట్‌లకు ఎకరాలు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుకు దక్కింది. తమకు ఇవ్వాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ధర్నా చేస్తే ఎస్సీ, ఎస్టీలను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుది. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు భయపడేది లేదు.
– కురసాల కన్నబాబు,
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్
జగన్‌ను సీఎం చేసేందుకు దళితులు శ్రమించాలి
గ్రామ గ్రామాన పర్యటించి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు దళితులంతా శ్రమించాలి. మనందరి గోల్ జగన్‌ను సీఎంను చేయడమే. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీలంటే గౌరవంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అదే స్ఫూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి అంతకు మించి చేసి మెడికల్ కాలేజీలు పెట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోంది. జగన్ పార్టీ రహితంగా అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేశారు. గ్రామాలలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో దళితులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించారు.
– పాముల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే
ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేశారు
తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులను అన్నివిధాలా ఆదుకున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పెట్టి దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత జగన్‌ది. అదే పేదలకు ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేసింది చంద్రబాబు. వైఎస్సార్ సీపీ హయాంలో హోంమినిస్టర్ తానేటి వనిత చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రస్తుత హోంమినిస్టర్ అనిత తాను సొంతంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కూటమి మంత్రులు మాటలు ఆకాశాన్నంటుతున్నాయి. దళితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా అణగదొక్కుతోంది.
– జక్కంపూడి విజయలక్ష్మి, పీఏసీఎస్ సభ్యురాలు


