తాళ్లరేవు: బోధనేతర పనులతో ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరిగిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మండల పరిధిలోని 14 ప్రభుత్వ హైస్కూళ్లు, ఏపీడబ్ల్యూఆర్ చొల్లంగిపేట పాఠశాలలో కృతజ్ఞతా పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధనేతర పనులతో ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధన అందించలేకపోతున్నారన్నారు. యూపీ పాఠశాల నుంచి హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ అయిన సుంకరపాలెం, పత్తిగొంది పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి అధికమైందని, ఈ విధానం సరికాదన్నారు. 11వ పీఆర్‌సీ గడువు ముగిసి 32 నెలలు గడిచినప్పటికీ సీఎం చంద్రబాబు పీఆర్‌సీ కమిషనర్‌ను ఇంతవరకు నియమించలేదన్నారు. వెంటనే ఆ కమిషన్ వేసి 29 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి టి.చక్రవర్తి, జిల్లా సహోధ్యక్షురాలు బి.నాగమణి, ఉమ్మడి జిల్లా ఎఫ్‌డబ్ల్యూఎస్ కోశాధికారి చెక్కా త్రిమూర్తులు, గోపి సత్యనారాయణ, ఎం.తాతారావు, కె.ఈశ్వరరావు, ఎం.బాలకృష్ణ పాల్గొన్నారు.


