కొత్తపేట: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పిలుపు మేరకు గ్రామ గ్రామాన ఘనంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. ఆయా నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి, పతాకావిష్కరణ చేయనున్నారు. అలాగే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యం
పేదల అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో కృషి చేయారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధనకు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని ఏర్పాటు చేశారన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఐదేళ్ల పాటు విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుపరిపాలన అందించారని కొనియాడారు.


