నేటి నుంచి చించినాడ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి చించినాడ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత

Mar 12 2026 7:43 AM | Updated on Mar 12 2026 7:43 AM

అమలాపురం రూరల్‌: మలికిపురం మండలం చించినాడ బ్రిడ్జి బేరింగ్‌ రీప్లేస్‌మెంట్‌ పనుల కారణంగా 14 రోజుల పాటు రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు బ్రిడ్జిపై రాకపోకలను నిలుపుదల చేస్తున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 12, 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో, అలాగే ఏప్రిల్‌ 2, 5, 8, 11, 16, 21, 26 తేదీలలో రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు వాహనాలు రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జేసీ విజ్ఞప్తి చేశారు.

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

అయినవిల్లి: ఆటోలో మర్చిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను సురక్షితంగా ప్రయాణికురాలికి అందించి సురేష్‌ అనే ఆటోడ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన బండారు హనుమాయమ్మ తన కుమార్తెతో పాటు కొత్తపేట వెళ్లేందుకు అయినవిల్లి మండలం ఎస్‌.మూలపాలేనికి చెందిన చీకురుమిల్లి సురేష్‌ ఆటో ఎక్కారు. కొత్తపేటలో ఆటో దిగే సందర్భంలో 10 కాసుల బంగారు నగలు ఉన్న బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆటో డైవర్‌ సురేష్‌ ఆ బ్యాగ్‌ను గమనించి అయినవిల్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు బ్యాగ్‌ను పోగొట్టుకున్న హనుమాయమ్మకు సమాచారం అందించారు. అయినవిల్లి పోలీస్‌ స్టేషన్‌లో సీఐ నరేష్‌ కుమార్‌, ఎస్సై జ్యోతిలు హనుమాయమ్మకు బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగ్‌ను అప్పగించారు. ఆటో డ్రైవర్‌ సురేష్‌ను ఘనంగా సత్కరించారు.

ఆక్వా రైతులకు

భరోసా కల్పించాలి

సాక్షి, అమలాపురం: ‘ఇరాన్‌ – అమెరికా యుద్ధాన్ని బూచిగా చూపించి వనామీ ధరలు తగ్గించేస్తున్నారని, దీనివల్ల టన్నుకు రైతు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోతున్నాడని కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు త్సవటపల్లి నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో వనామీ ధరలు పడిపోకుండా కాపాడడంతో పాటు సాగు చేసే రైతులకు మేమున్నామనే భరోసాను ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించాలని కోరారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఆక్వా రైతుల గోడును తెలియజేశారు. గత ఏడాది ట్రంప్‌ సుంకాల పేరుతో రాష్ట్రంలో ఆక్వా రైతుల నుంచి రూ.వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు మాత్రం ట్రంప్‌ ట్యాక్సుల వల్ల కొనుగోలుదారులు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు నష్టపోయినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు చెప్పడం సత్యదూరమని విమర్శించారు. ఈ మాటను పట్టుకుని కొనుగోలుదారులు బ్యాంకు రుణాల చెల్లింపులపై మారిటోరియం తెచ్చుకున్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా ఏ సంక్షోభం వచ్చినా రైతులే నష్టపోతున్నారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా సంక్షోభ సమయంలో రొయ్యలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

చురుగ్గా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

అమలాపురం రూరల్‌: జిల్లాలో 14 ఏళ్ల వయసున్న బాలికలకు హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌ చురుగ్గా సాగుతోందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డీఐవో) బీవీవీ సత్యనారాయణ అన్నారు. ఆయన బుధవారం అమలాపురం బండారులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, సర్పంచ్‌ పెనుమాల సునీతతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఐవో మాట్లాడుతూ 14 ఏళ్ల వయసున్న బాలికలకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ సోకకుండా ఉండేందుకు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ జరుగుతోందన్నారు. ఎంపీపీ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బాలికల్లో భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ముందుగానే నివారించేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందని తెలిపారు. డాక్టర్‌ గౌతమి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించి, తమ ప్రాంతంలో అర్హులైన బాలికలను గుర్తించారన్నారు. డాక్టర్‌ అమృత మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రమాదకరవ్యాధి అని చెప్పారు. ఎంపీటీసీ గుత్తుల జానకీలక్ష్మి, మాజీ ఎంపీటీసీ మాధవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement