అన్నం ఉడకలేదని కొట్టిన భర్త | - | Sakshi
Sakshi News home page

అన్నం ఉడకలేదని కొట్టిన భర్త

Mar 11 2026 7:34 AM | Updated on Mar 11 2026 7:34 AM

112కి కాల్‌ చేసి

పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

అమలాపురం టౌన్‌: అన్నం సరిగా ఉడకించకుండా భోజనం పెట్టిందని భార్యను భర్త కొట్టడంతో ఆమె 112కి కాల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అమలాపురం మెట్లకాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఫోన్‌ కాల్‌ సమాచారంతో తక్షణమే ఆమె ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో ఆయనకు పోలీసులు ఫోన్‌ చేసి మాట్లాడారు. 60 సంవత్సరాలు దాటిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.

అమలాపురం మున్సిపాలిటీ

స్పెషల్‌ ఆఫీసర్‌గా జేసీ నిషాంతి

అమలాపురం టౌన్‌: అమలాపురం మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) టి.నిషాంతిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ వరకూ ప్రస్తుత కౌన్సిళ్ల పదవీకాలం ఉంటుంది. 17వ తేదీ తర్వాత మున్సిపాలిటీలకు స్పెషల్‌ ఆఫీసర్లు బాధ్యతలు చేపడతారు. జిల్లాలోని రామచంద్రపురం మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా రామచంద్రపురం ఆర్డీవో, ముమ్మిడివరం నగర పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌గా అమలాపురం ఆర్డీవో బాధ్యతలు చేపట్టనున్నారు.

మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా

ఆర్డీవో మమ్మీ

రామచంద్రపురం: మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా రామచంద్రపురం ఆర్డీవో జి.మమ్మీని ప్రభుత్వం నియమించింది. త్వరలో మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. ఈ మేరకు మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వ్యవహరించనున్నారు.

ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ ఉత్తమ

క్రీడాకారుడిగా సమంత్‌కుమార్‌

దేవరపల్లి: రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన దేవరపల్లి అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్‌ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి కె.సమంత్‌కుమార్‌ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. సమంత్‌కుమార్‌కు నిర్వాహకులు రూ.35 వేల విలువ గల ఎలక్ట్రికల్‌ సైకిల్‌ను బహుమతిగా అందజేసి సత్కరించారు. పోటీల్లో జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా సమంత్‌కుమార్‌ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికై నట్టు పీడీ ఓరుగుంటి రామకృష్ణంరాజు తెలిపారు.

తెలుగు వర్సిటీకి వేటూరి సాహిత్య సంపుటాలు

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రముఖ సినీ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్య సంపుటాలను బహూకరించారని ఉపాధ్యక్షుడు ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు, సినీగేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు–ఎనిమిది గ్రంథాలుగా అమెరికాలోని వేటూరి సాహిత్యభిమాన సమితి వారు 2026 జనవరిలో తొలిసారిగా ప్రచురించారన్నారు. దొరకునా ఇటువంటి సేవ(వాల్యూమ్‌–1), మానసవీణా మధుగీతం(వాల్యూమ్‌–2), నవమి నాటి వెన్నెల(వాల్యూమ్‌–3),ఎడారికోయిల(వాల్యూమ్‌–4), ఝమ్మంది నాదం(వాల్యూమ్‌–5), ఎరక్కపోయి వచ్చాను (వాల్యూమ్‌–6) గ్రంథాలతో పాటు గతంలో ప్రచురించిన వేటూరి సుందర రామమూర్తి పుస్తకాలు‘కొమ్మకొమ్మకోసన్నాయి’, ‘రాబిన్‌హుడ్‌’,‘జీవనరాగం’‘సిరికాకొలనుచిన్నది’ సంపుటాలను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉండేవిధంగా సుందరరామమూర్తి కుమారుడు వేటూరి రవిప్రకాష్‌ ఆచార్య మునిరత్నంనాయుడుకు మంగళవారం అందజేశారు. రాజమహేంద్రవరం సాహిత్యపీఠంలో డాక్టర్‌ పొన్నాలీలావతి పర్యవేక్షణలో జయంతి చక్రవర్తి అనే విద్యార్థి వేటూరి సుందరరామమూర్తి పాటలు – సాహిత్యపు విలువలు అనే అంశంపై పీహెచ్‌డీ కోసం పరిశోధన చేసి పట్టా అందుకోవడం విశేషమని ఆచార్య మునిరత్నంనాయుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement