సాక్షి, అమలాపురం: ‘రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహం పేరుతో.. అమరావతిలో మల్టీ కంపెనీలు రావాలంటూ రూ.కోట్ల విలువ చేసే భూములను కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఇచ్చే భూమికి రూ.50 లక్షల చొప్పున వసూలు చేయడం దారుణమని’ వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) విమర్శించారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయం కట్టమని కోరిన చంద్రబాబు ఆ భూమికి టీటీడీ ద్వారా రూ.12.50 కోట్లు కట్టించారన్నారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవో 747 ద్వారా అటవీ శాఖ పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్టు భూమిని కేంద్రాన్ని ఒప్పించి టీటీడీ పరిధిలోకి తెచ్చారని రామారావు గుర్తు చేశారు. బ్రిటిష్ కాలం నుంచి టీటీడీకి 22.50 చదరపు కిలోమీటర్లు ఉన్న ఏడు కొండల విస్తీర్ణం వైఎస్సార్ తెచ్చిన జీవో వల్ల 350 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. వైఎస్సార్ టీటీడీ ఆస్తులు పెంచితే.. చంద్రబాబు టీటీడీ ఆదాయానికి గండిపెట్టారన్నారు. దేవదేవునికి మేలు చేసే విషయంలో వైఎస్సార్ నుంచి చంద్రబాబు నేర్చుకోవాలని కోరారు.
వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు బాబీ


