అమలాపురం టౌన్: హిమాలయ శిఖరాలను ఏడు సార్లు అధిరోహించిన అమలాపురానికి చెందిన జాతీయ పర్వతారోహకుడు పుత్సా కృష్ణ కామేశ్వర్ రచించిన ’ది బ్యాక్ ప్యాకర్స్– సీజన్–1’ ఆంగ్ల నవల ఆవిష్కరణ స్థానిక కూచిమంచి అగ్రహారంలో మంగళవారం జరిగింది. ప్రకృతి ప్రేమికులు, సాహిత్యాభిమానులు, నడక మిత్రల సమక్షంలో నవల ఆవిష్కరణ సాగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర నవలను సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రచయిత తన వ్యక్తి గత అనుభవాలను, ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా సమన్వయ పరచి రాశారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌సీసీ చైర్మన్ డాక్టర్ ఏఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ నవలలో ప్రకృతి వైభవాన్ని రచయిత చాలా బాగా అభివర్ణించారన్నారు. ఎన్‌సీసీ జాతీయ అవార్డు గ్రహీత, మేజర్ శారద నవలకు ముందు మాట రాశారు. నవల రచయిత కృష్ణ కామేశ్వర్ మాట్లాడుతూ హిమాలయాల అనుభూతిని అందరికీ పంచాలనే ఈ పుస్తకాన్ని రాశానని చెప్పారు.


