ఫ కాలువలో స్నానానికి దిగిన బాలురు
ఫ నీటి ఉధృతికి ఒకరి గల్లంతు
అనపర్తి: రంగుల పండగ హోలీని చిన్నారులందరూ సరదాగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం ఒంటిపై రంగులను కడుక్కుందామని కాలువలో దిగిన చిన్నారుల్లో ఒక బాలుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొమరపు దేవా అలియాస్ విజయ కుమార్ పెయింటర్‌గా పనిచేస్తూ అనపర్తిలో కాపురం ఉంటున్నాడు. ఆయనకు రాహుల్ (9), బన్ను అనే ఇద్దరు కుమారులు, ఒక పాప ఉన్నారు. హోలీని పురస్కరించుకుని మంగళవారం అన్నదమ్ములు, మరో ఇద్దరు బాలురతో కలసి రంగులు చల్లుకున్నారు. అనంతరం ధరణికోట శివాలయం వద్ద ఉన్న కాలువ రేవులో స్నానానికి దిగారు. కాలువలో నీటి ఉధృతికి శేఖర్, రాహుల్ కొట్టుకుపోయారు. శేఖర్‌ను గుడి దగ్గర ఉన్న సత్తిబాబు అనే వ్యక్తి బయటకు లాగి కాపాడాడు. రాహుల్ నీటిలో కొట్టుకుపోతుండగా అతడి అన్న బన్ను కేకలు వేస్తూ కాలువ గట్టు మీద కొద్ది దూరం పరిగెత్తాడు. విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి దేవ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కాలువలో నీరు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అదనపు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. రాహుల్ ఆచూకీ కోసం ఎస్‌ఎఫ్‌వో జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది కాలువలో దిగి గాలింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. నీటి ఉధృతి నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు.


