మామిడికుదురు: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 19,310 మంది విద్యార్థులు హాజరు కానున్నారని డీఈఓ పి.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మామిడికుదురు, నగరం, మొగలికుదురు, పాశర్లపూడి జెడ్పీహెచ్ స్కూళ్లను సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఈ నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని అన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 108 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 219 మంది సీఎస్, డీఓ, ఏడీఓలను నియమించామన్నారు. ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో వెనుకబడిన రైజింగ్ స్టార్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వారిని షైనింగ్ స్టార్లుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు. పట్టుదలతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఎంఈఓలు శ్రీనివాస్, మోకా వెంకన్నబాబు, హెచ్‌ఎంలు పాల సోమేశ్వరరావు, బి.చిరంజీవి, కేఎం గాంధీ ఉన్నారు.
సమస్యలపై భారీగా అర్జీలు
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా అర్జీలు వచ్చాయి. కొత్త పింఛన్లు, భూ సమస్యలు, భూ సర్వే, సాగు, తాగునీటి సమస్యలపై మొత్తం 200 అర్జీలు అందజేశారు. సమస్యలపై అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌కు భూ సమస్యలపై అధిక ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ నిషాంతి, డ్వామా పథక సంచాలకులు ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, డీఎల్‌డీఓలు రాజేశ్వరరావు, వేణుగోపాల్‌లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేస్తూ నూటికి నూరు శాతం సంతృప్తికర పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికను సమర్పించాలి
అమలాపురం రూరల్: ఐదేళ్లలో జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే లకా్‌ష్య్‌ల ప్రణాళికను 15 రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పీ–4 బంగారు కుటుంబాల దత్తత తనిఖీ, పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల అప్లోడ్ అంశాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత ప్రాధాన్య అంశాల వారీగా లకా్‌ష్య్‌లను సాధించి జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. సీపీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తులు
గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికి, అలాగే ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చేరడానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ప్రవేశాల నిమిత్తం ముద్రించిన ప్రచార వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. గురుకుల విద్యాలయాల్లో విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందన్నారు. గురుకుల ప్రిన్సిపల్ హేమలత పాల్గొ న్నారు.


