డొక్కా సీతమ్మ స్ఫూర్తి కావాలి
సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్
పి.గన్నవరం: అన్నదాతగా పేరొందిన డొక్కా సీతమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని కనీసం నెలకోసారైనా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఎల్.గన్నవరం గ్రామంలోని సీతమ్మ వారి నివాసాన్ని ఆయన సందర్శించారు. సీతమ్మ వారు వినియోగించిన రోలు, కుర్చీ, మంచినీళ్ల బావి, భోషానం పెట్టె తదితర వస్తువులను పరిశీలించారు. సీతమ్మ కుటింబీకులైన సూర్యప్రభ తదితరులతో ఆయన మాట్లాడారు. ఆమె చిత్రపటానికి నమస్కరించారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. సీతమ్మ వారి నివాసాన్ని సందర్శించడంతో ఒళ్లు పులకించిందన్నారు. చిన్నప్పటి నుంచి ఆమె జీవిత చరిత్రను కథలు, కథలుగా విన్నామని అన్నారు. సీతమ్మ వారి పేరుపై వారి కుటుంబ సభ్యులు ఏమైనా చేయాలనుకుంటే తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. అవకాశం వస్తే తన రచనల్లో సీతమ్మ వారికి ప్రాధాన్యం కల్పిస్తానని ఆయన అన్నారు. విజయేంద్ర ప్రసాద్‌ను డొక్కా బుచ్చిబాబు దుశ్శాలువాతో సత్కరించారు. తొలుత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆయనకు స్వాగతం పలికారు.
స్వామి ప్రతిబింబాన్ని చూపినట్టు..
విజయేంద్ర ప్రసాద్ అంతర్వేదిలో కొత్త అద్దం తీసుకుని, దానిని నరసింహ స్వామివారిని చూపి, వెంటనే ఒక వస్త్రంతో దానిని మూసివేశారు. ఆ అద్దాన్ని ఇక్కడ సీతమ్మ వారి చిత్రపటం ముందు తెరిచారు. దీంతో నరసింహ స్వామి ప్రతిరూపం సీతమ్మ వారికి చూపినట్టు అవుతుందని ఆయన వివరించారు. ఇలా ఎందుకు చేశానంటే.. సీతమ్మ వారు ఒక రోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయల్దేరారు. దారిలో బోయీలు చెట్టుకింద ఆగారు. అయితే అక్కడ ప్రయాణికుల బృందంలోని చిన్న పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అందులో ఒకరు ఏడవకండి అమ్మా, దగ్గరలో సీతమ్మ వారి ఇల్లు ఉంది, అక్కడికి వెళితే మనకి అన్నం పెడతారని పిల్లలకు చెప్పారు. ఈ మాటలు విన్న సీతమ్మ వారు, వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ప్రయాణికులు వచ్చేలోగా వారికి వంట చేసి, అన్నం పెట్టారని విజయేంద్ర ప్రసాద్ వివరించారు. నాడు సీతమ్మ వారు నరసింహస్వామిని దర్శించుకోలేక పోయారని, అందుకే స్వామి ప్రతిబింబాన్ని సీతమ్మ వారికి అద్దంలో చూపినట్టు ఆయన చెప్పారు.


