ఆక్రందనలు ఆగోవు | - | Sakshi
Sakshi News home page

ఆక్రందనలు ఆగోవు

Feb 10 2026 7:52 AM | Updated on Feb 10 2026 7:52 AM

ఆక్రం

ఆక్రందనలు ఆగోవు

సముద్ర తీరంలో ఆవుల మృత్యుఘోష

బాలబందు మొక్కలను

తిని చనిపోతున్న వైనం

అధికారుల చర్యలు శూన్యం

కాట్రేనికోన: మూగజీవాల మృత్యుఘోష ఆగడం లేదు.. విష తుల్యమైన ఆకులు తిని ఆవులు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సముద్ర తీరం వెంబడి సంచరిస్తున్న ఆ జీవుల ఆక్రందనలు ఎవరికీ వినిపించడం లేదు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి, అల్లవరం, కాట్రేనికోన మండలాల పరిధి శివారు ప్రాంతాలను ఆనుకుని సముద్ర తీరం విస్తరించి ఉంది. దీని వెంబడి సంచరిస్తున్న ఆవులు మేతగా తీగ జాతికి చెందిన (బాలబందు) మొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. చిర్రయానం నుంచి నీళ్లరేవు మధ్యలో సుమారు 700 ఆవులు సముద్ర తీరంలో జీవిస్తున్నాయి. అంతర్వేది, ఓడలరేవు, నక్కారామేశ్వరం, వాసాలతిప్ప, ఎస్‌.యానం, చిర్రయానం, నీళ్లరేవు, కొత్తపాలెం లైట్‌ హౌస్‌, మొగ ప్రాంతం సముద్ర తీరం వెంబడి తీగ జాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆవులు మేతకు అవసరమైన గడ్డి జాతి, ఇతర మొక్కలను పెరుగుదలను అడ్డుకుంటున్నాయి. సముద్ర తీరం వెంబడి వందలాది ఆవులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మేత లేక విషపూరితమైన ఈ తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాయి. అలాగే సముద్ర తీరం వెంబడి ఆవులకు తాగేందుకు మంచి నీరు ఉండడం లేదు.

గిర్రున తిరిగి.. కిందకు ఒరిగి

విషపూరితమైన తీగ జాతి మొక్కల ఆకులను ఆహారంగా తీసుకుంటున్న ఆవుల తల తిరిగిపోవడంతో గిర్రున తిరిగి తూలుతూ కిందకు పడిపోతున్నాయి. అలా రోజుల పాటు ఆహారంగా తీసుకోవడంతో వాటికి తెలియని మత్తు రావడంతో తూలుతూ తిరుగుతై చివరకు మృత్యువాత పడుతున్నాయి. ఆ ఆవులు గంజాయి, మద్యం తాగిన వారివలే పడుతూ లేస్తూ ఉంటున్నాయి. సముద్ర తీరం వెంబడి మేత లేక వదిలినప్పుడు ఆకులు తినడంతో చనిపోతున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మసమేథ్యం సమీపంలో కాల భైరవస్వామి ఆలయం అర్చకుడికి చెందిన ఐదు పాడి ఆవులు విష పూరితమైన ఈ ఆకులను ఆహారంగా తీసుకునే చనిపోయాయి. ఈ తీగను ఆహారంగా తిన్న తల్లి ఆవు పాలు తాగుతున్న పిల్లలు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల పల్లం శివారు బ్రహ్మసమేథ్యం కాలభైరవస్వామి ఆలయ సమీపంలో సముద్రం ఒడ్డున ఆవు దూడ చలికి శరీరం పూర్తిగా చల్లబడి వణికిపోవడంతో పాటు కాళ్లు బిగిసిపోవడంతో చలి మంటను వేసి ఆవు దూడకు వేడి తగిలే విధంగా స్థానికులు ఏర్పాటు చేశారు. అయితే విష పూరితమైన తీగ ఆకును ఆహారంగా తీసుకున్న తల్లి పాలతో పాటు ఆవు దూడ తీగ ఆకును తినడంతో పరుగులు పెడుతూ.. తూలుతూ.. పడి పోవుతూ.. కొన్ని రోజులకు చనిపోయింది.

ఐదు ఆవులు చనిపోయాయి

తీగ ఆకులు తినడంతో ఐదు ఆవులు చనిపోయాయి. ఇటీవల కాలభైరవస్వామికి క్షీరాభిషేకం, నైవేద్యం కోసం రూ.35 వేలు పెట్టి పాడి ఆవును కొన్నాం. మేతకు వదిలినప్పుడు తీగ జాతికి చెందిన ఆకులను తినడంతో గుండ్రంగా తిరుగుతూ కొన్ని రోజులకు మృత్యువాత పడింది.

–కామేశ్వరరావు,

కాలభైరవస్వామి ఆలయ అర్చకుడు, పల్లం

పీక్కుతింటున్నాయి..

విషపూరితమైన తీగ ఆకులు ఆహారంగా తినడంతో తెలియని మత్తులో తూలుతూ, పడుతూ బలహీనంగా ఉన్న ఆవులను కుక్కలు, రాత్రి వేళ నక్కలు సైతం పీక్కు తింటున్నాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి ఆవులను వదిలేస్తున్నారు. తిరిగి ఆవులు బాగుంటే పాల కోసం తెచ్చుకుంటున్నారు. పాడి రైతులు సొంత ఆవులను పాలు వదిలిన తరువాత సముద్ర తీరం వెంబడి వదిలివేయకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఆవులను గుర్తించి గోశాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే మూగజీవాలకు రక్షణ ఉంటుందని పశు ప్రేమికులు అంటున్నారు.

ఆక్రందనలు ఆగోవు1
1/2

ఆక్రందనలు ఆగోవు

ఆక్రందనలు ఆగోవు2
2/2

ఆక్రందనలు ఆగోవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement