నిరుత్సాహక బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుత్సాహక బడ్జెట్‌

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

నిరుత

నిరుత్సాహక బడ్జెట్‌

సాక్షి, అమలాపురం: ‘కేంద్రం మిథ్య’.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు తరచూ చెప్పే మాట ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌ చూసినవారి నోట వినిపిస్తోంది. రైతులు.. వ్యాపారులు.. ఉద్యోగులు.. మధ్య తరగతి వర్గాలు.. మేధావులు.. ఇలా చెప్తూ పోతే... కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. ఏటా ఇస్తున్న ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ని పెంచలేదని, పరిమితి పెంచుతారని రైతులు.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శ్లాబ్‌ను పెంచుతారని ప్రభుత్వ ఉద్యోగులు.. గ్యాస్‌, ఇతర నిత్యావసరాలు తగ్గేలా చర్యలు తీసుకుంటారని మహిళలు, మధ్య తరగతి వర్గాలు పెట్టుకున్న ఆశలపై నిర్మలమ్మ బడ్జెట్‌ నీళ్లు చల్లింది.

రైతులకు కొన్ని మేలు చేసే ప్రకటనలు చేసినా ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించేలా చర్యలు, వాటికి కేటాయింపులు లేకపోవడంతో వ్యవసాయ ఆధారిత జిల్లా కోనసీమలో రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఫ కేంద్ర బడ్జెట్‌లో రైతులకు ప్రకటించిన వాటిలో కొబ్బరి, కోకో రైతులకు కొంత వరకు ఊరట కలిగింది. పాత తోటల తొలగింపు, కొత్త తోటల విస్తరణకు నిధులు కేటాయిస్తామన్నారు. తీర ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల్లో లాభదాయక పంటల సాగుకు అధిక నిధులు కేటాయిస్తామనే ప్రకటన కోనసీమ జిల్లా రైతులను కొంత వరకు ఆకర్షించింది. జిల్లాలో సుమారు 90 కిమీల విస్తీర్ణంలో తీర ప్రాంతం ఉంది. ఇక్కడ కొబ్బరి, జీడి మామిడి, మత్స్య సాగుకు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

ఫ పశుపోషణ కోసం రుణాలు తీసుకునే రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీతో పాటు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వనుంది. ‘క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌’ ద్వారా డెయిరీ, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. మత్స్యకారులు, మహిళా సంఘాల ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌తో అనుసంధానించేలా ప్లాన్‌ చేశారు.

సాంకేతికతతో సాగు..

భారత్‌ విస్తార్‌ యోజన వ్యవసాయ రంగంలోకి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధునిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి ‘భారత్‌ విస్తార్‌ యోజన’ను ప్రభుత్వం ప్రకటించింది.

ఫ ఇప్పటికే సంక్షోభంలో ఉన్న కొబ్బరికి విలువ ఆధారిత పరిశ్రమల విషయాన్ని మాత్రం చెప్పలేదు. వీటిని ఇప్పటికే ఎంఎస్‌ఎంఈలలో ప్రోత్సహిస్తున్నా మార్కెటింగ్‌ సదుపాయం లేక కోనసీమ రైతులు ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే.

ఫ జిల్లాలో కీలకమైన కోటిపల్లి–నర్సాపురం రైల్వేలైన్‌కు ఈ ఏడాది కేటాయింపులపై ఇంకా ప్రకటన విడుదల కాలేదు. కేంద్ర బడ్జెట్‌ ప్రకటించిన నాలుగైదు రోజుల తరువాత కేటాయింపులపై స్పష్టత వస్తోంది. గత ఏడాది ప్రాజెక్టుకు మొత్తం నిధులు కేటాయించారని బీజేపీతో పాటు టీడీపీ, జనసేన నాయకులు ప్రకటనలు చేసినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారిన విషయం తెలిసిందే.

ఫ ఎంఎస్‌ఎంఈలకు భారీగా నిధులు కేటాయించామని, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పెంచుతామని బడ్జెట్‌లో చెప్పినా యువతకు నమ్మకం కలగడం లేదు. పారిశ్రామిక అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న జిల్లాలో ఎంఎస్‌ఎంఈల ద్వారా పరిశ్రమల ఏర్పాటు పెద్దగా జరగడం లేదు. వీటితో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది. ఇప్పుడు నిధులు, యూనిట్లు పెంచినా ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు.

ఫ వంట గ్యాస్‌ ధరలు తగ్గించే చర్యలు తీసుకున్నట్టుగా బడ్జెట్‌లో ప్రస్తావనకు రాకపోవడం మహిళలను నిరాశ పరిచింది.

సాధారణ వ్యాపారులకీ

మేలు జరగదు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ వల్ల వ్యాపార వర్గాలకు కలిగిన ప్రయోజనం ఏమి కనిపించడం లేదు. గతంలో జీఎస్టీ శ్లాబ్‌లు తగ్గించారు. మరికొన్ని సామాన్యులు నిత్యం వినియోగించే వస్తువులు మీద మరింత జీఎస్టీ తగ్గించాలని కోరినా పట్టించుకోలేదు. వాటి మీద శ్లాబ్‌లు తగ్గించి ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో పాటు జిల్లాలో వ్యాపార వర్గాలకు కూడా మేలు జరిగేది. ఈ బడ్జెట్‌ వల్ల పెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప చిరు వ్యాపారులకు నేరుగా ఏ మేలూ లేదు.

– కర్రి నాగిరెడ్డి, ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌

మాజీ అధ్యక్షుడు, రావులపాలెం.

కేంద్రం పద్దులపై పెదవి విరిచిన ప్రజలు

ఆదాయపన్ను శ్లాబు పెంపుపై నిరాశ

యువతకు ఉపాధి హామీలపై రిక్త హస్తం

వంట గ్యాస్‌ ధరలు తగ్గించకపోవడంపై మహిళల నిరాశ

నిరుత్సాహక బడ్జెట్‌ 1
1/1

నిరుత్సాహక బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement