జగన్నతోటలో భక్తుల ఆపసోపాలు
జగన్న తోట ప్రభల తీర్థం ఈ ఏడాది రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తీర్థాన్ని మాత్రం నిర్వహకులు చందాలు వేసుకుని ఘనంగా నిర్వహించారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది భక్తులు వస్తే పదుల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి వదిలేశారు. ట్రాఫిక్ నియంత్రించడంలో పోలీస్ సిబ్బంది ముఖం చాటేశారు. మొసలపల్లి వంతెన వద్ద వీఐపీలకు కార్ పార్కింగ్ ఇవ్వడంతో అటువైపు తీర్థానికి వచ్చిన భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఒకనొక దశలో ఇక్కడ తోపులాట చోటు చేసుకుంది. రాష్ట్ర పండగ అంటే ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రొటోకాల్ కల్పించడమే అన్నట్టుగా అధికారులు ఉత్సాహం చూపించారు.


