ఎస్సీల అభివృద్ధికి చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీల అభివృద్ధికి చొరవ చూపాలి

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

జాతీయ ఎస్సీ కమిషన్‌

చైర్మన్‌ కిశోర్‌ మక్వానా

దిండిలో జిల్లా అధికారులతో సమీక్ష

మలికిపురం: విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా షెడ్యూల్‌ కులాల సామాజిక, ఆర్థిక అభివృ ద్ధికి అధికారులు చొరవ చూపాలని జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌ అధ్యక్షుడు కిశోర్‌ మక్వానా ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని దిండి హరిత కోకోనట్‌ రిసార్ట్‌లో ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఎస్సీ సంక్షేమం, పథకాల పురోగతిని, అట్రాసిటీ చట్టం అమలు అంశాలను ఆయనకు నివేదించారు. అనంతరం కమిషన్‌ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ అక్షరాస్యత శాతం పెరగాల్సి ఉందని, 15 ఏళ్ల క్రితం నిర్మించిన వసతి గృహాలే నేటికీ ఉన్నాయని, కొత్త వాటిని నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలతో జీవనోపాధి యూనిట్లు నెలకొల్పాలన్నారు. ఎస్సీ కాలనీలలో అంతర్గత రహదారులు మెరుగుపరచాలని జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలన్నారు. జేసీ నిశాంతి మాట్లాడుతూ బ్యాగ్‌లాగ్‌ పోస్టులను సక్రమంగా భర్తీ చేయాలని సూచించారు. అలాగే అధికారుల నివేదికలను అనుసరించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. షెడ్యూల్‌ కులాల శ్రేయస్సు, రక్షణే ధ్యేయంగా కమిషన్‌ పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌, ఎస్పీ రాహుల్‌ మీనా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలి

జిల్లా పర్యటనలో ఉన్న ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మక్వానాకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు, పదోన్నతులలో రిజర్వేషన్‌ నిబంధనలు పాటించాలని కోరుతూ ఏపీ ఎస్సీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వినతి పత్రం అందజేసింది. ఓపెన్‌ కేటగిరిలో ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆ కేటగిరీ లోనే ఉద్యోగాలు కల్పించాలని, వారిని రోస్టర్‌ లోనికి తీసుకురావద్దని, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైం అడహాక్‌ ప్రైవేట్‌ రంగాల్లో కూడా రిజర్వేషన్‌ అమలు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోసంగి బంగార్రాజు, ఆర్థిక కార్యదర్శి సాధనాల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బత్తుల రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement