బండ భారం రూ.2.38 కోట్లు | - | Sakshi
Sakshi News home page

బండ భారం రూ.2.38 కోట్లు

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

గృహ అవసరాల సిలిండర్‌పై రూ.60

వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంపు

అమలాపురం టౌన్‌: ఇరాన్‌ యుద్ధ ప్రభావం గ్యాస్‌ సిలిండర్లపై తీవ్రంగా పడింది. డొమస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌ సిలండర్‌పై రూ.115 చొప్పున పెరగడంతో సామాన్యులు ‘బండ’ భారం భరించలేక విలవిలలాడుతున్నారు. జిల్లాలో డొమస్టిక్‌ గ్యాస్‌ సిలండర్లు 3,71,502 ఉన్నాయి. పెరిగిన ధర సుమారు రూ.2.23 కోట్ల మేర వినియోగదారులపై భారం పడనుంది. కమర్షియల్‌ సిలిండర్లు జిల్లాలో 13,062 ఉండగా, పెరిగిన ధరతో రూ.15 లక్షలకు పైగా భారం పడనుంది. మొత్తం మీద జిల్లాలో డొమస్టిక్‌, కమర్షియల్‌ గ్యాస్‌ సిలండర్లపై పెరిగిన ధరల ప్రభావం రూ.2.38 కోట్ల మేర భారం పడనుంది. కాగా ప్రస్తుతం వాణిజ్య అవసరాల సిలండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపేసినట్లు జిల్లా పౌర సరఫరా సంస్థ అధికారులు చెబుతున్నారు. అసలే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జిల్లా వినియోగదారులు విలవిలలాడుతుంటే ప్రస్తుత గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారాయి. ప్రస్తుతం రూ.885 ఉన్న డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.945 చేరుకుంది. జిల్లాలో సింగిల్‌ సిలండర్లు 2,39,303, డబుల్‌ సిలండర్లు 1,32,199 ఉన్నాయి. అలాగే ఉజ్వల్‌, సీఎస్‌ఆర్‌, దీపం పథకాల కింద 2,42,332 సిలిండర్లు ఉన్నాయి. జిల్లాలో నెల నెలా మొత్తం 3.5 లక్షలు సిలిండర్లు వినియోగం అవుతాయి. తాజా పరిణామాలతో ఆయల్‌ కంపెనీలు కొత్త నిబంధనలు తెరమీదకు తీసుకువచ్చాయి. సింగిల్‌ సిలండర్‌ ఉన్న వినియోగదారులు 21 రోజుల తర్వాత, డబుల్‌ సిలిండర్లు ఉన్న వారు 30 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్‌ చేసుకునేలా ఆంక్షలు విధించాయి. రానున్న రోజుల్లో వంట గ్యాస్‌ సిలిండర్ల కొరత ఉండదని డీఎస్‌వో అడపా ఉదయ భాస్కర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement