రాత్రిళ్లు గాండ్రిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

రాత్రిళ్లు గాండ్రిస్తూ..

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి

డి.కృష్ణవరం సమీపానే మకాం

పాదముద్రల ఆధారంగా నిర్ధారణ

అడ్డతీగల: అడ్డతీగల: పులి తన ఉనికిని చాటుతోంది.. రాత్రిళ్లు మూగజీవాలపై విరుచుకుపడుతోంది.. అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇదిలా ఉంటే పులి సంచారంతో జిల్లాలోని ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. అటవీ ప్రాంతానికి చేరువలోనే ఏలేరు వాగు, జలాశయం ఉండడంతో పులి సంచారానికి అనువైన ప్రాంతంగా ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి అడ్డతీగల మండలం డి.కృష్ణవరంలో ఆవు, దూడను పులి హతమార్చింది. ఆ కళేబరాలను అక్కడే పులికి ఎరగా ఉంచడంతో శనివారం అర్ధరాత్రి సమయాన వచ్చి దూడ కళేబరాన్ని కొద్దిదూరం తీసుకుపోయి ఒక కాలిని ఆహారంగా తీసుకుంది. మిగతా శరీరాన్ని అలాగే వదిలేసింది. అటవీ అధికారులు ఆదివారం ఉదయాన్నే దూడను తీసుకుపోయిన ప్రాంతం అంతా గాలించారు. పులి పాదముద్రలను గుర్తించారు. కొద్దిదూరం వరకూ పాదముద్రలను గమనించిన అధికారులు, పులి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తేల్చారు. రాజమహేంద్రవరం గత సీఎఫ్‌ బీఎన్‌ఎన్‌ మూర్తి, ప్రస్తుత సీఎఫ్‌ శ్రీకంఠనాథరెడ్డి, కాకినాడ డీఎఫ్‌ఓ రామచంద్రరావు, రంపచోడవరం డీఎఫ్‌ఓ శివకుమార్‌ గంగల్‌, అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి నాగార్జునాసాగర్‌, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంతో కలసి ఆయా రేంజ్‌ల అధికారులు మిగతా సిబ్బంది పులి పట్టివేతకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

అలా అనుకుంటే ఇలా..

డి.కృష్ణవరం సమీపాన తిష్టవేసిన పెద్ద పులిని బంధించడానికి అధికారులు మూడు బోన్లను ఏర్పాటు చేశారు. ఆయా బోన్లలో రెస్క్యూ టీంకు చెందిన షూటర్లు ఒక్కో బోనులో ఒక్కొక్కరు చొప్పున కాపు కాసి ఉన్నారు. ఆదివారం సాయంత్రం అధికారుల ఆదేశాల మేరకు రెస్క్యూ టీం సభ్యులు దీనికి అనువైన ఏర్పాట్లు చేశారు. రేడియో సిగ్నల్స్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ అనుసంధానం చేసుకుని వాటి ద్వారా పులి కదలికలను గమనిస్తూ ఎలాగైనా సరే పులిని బంధించాలనే లక్ష్యంతో నిఘా ఉంచారు. అయితే పులి మాత్రం అధికారులు భావించినట్లు కాకుండా డి.కృష్ణవరం సమీపాన మూడు బోన్లు ఉంచినా అటుగా వెళ్లకుండా పులి మరో దారి నుంచి వచ్చి తిమ్మాపురం – బొంగరాలపాడు మధ్య ఏలేరు వాగును దాటుకుని వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు. దీంతో అటవీ సిబ్బంది వెంటనే వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతం పరిసరాల్లోని వెళ్లారు. ప్రజలు పశువులను అడవుల్లోకి తీసుకెళ్లడం గాని, ఒంటరిగా బయటకు వెళ్లడం గాని చేయరాదని, ఆయా గ్రామాల్లో అధికారులు దండోరా వేయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement