అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకోలుపు సేవ, ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహా నివేదన చేశారు. సాయంత్రం విశేష సేవల అనంతరం తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 34 మంది పాల్గొన్నారు. 24 మంది లక్ష్మీగణపతిహోమంలో పాల్గొన్నారు. ఒక జంట పంచామృతాభిషేకం నిర్వహించారు. ముగ్గురు చిన్నారులకు నామకరణ, 46 మందికి అక్షరాభ్యాసాలు, 12 మందికి తులాభారం సమర్పించారు. 48 మంది వాహన పూజలు చేయించుకోగా, 3769 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.3,72,245 ఆదాయం లభించినట్లు ఏసీ, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
దూసుకొచ్చిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల ఆర్‌అండ్‌బీ రోడ్డులో గుమ్మరేగుల వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్.పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరహాలు (45) మండలంలోని బీబీ పట్నంలో శనివారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడు. తిరిగి స్కూటీపై స్వగ్రామం ఎస్.పైడిపాల వెళ్తూండగా.. గుమ్మరేగుల వద్ద ఎదురుగా రౌతులపూడి వైపు వస్తున్న ఎర్రమట్టిని లారీ వేగంగా దూసుకువచ్చి, అతడిని బలంగా ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన వరహాలు తలపై నుంచి లారీ చక్రాలు దూసుకుపోయాయి. దీంతో, తల నుజ్జునుజ్జయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రౌతులపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వరహాలు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు వరహాలుకు భార్య రామలక్ష్మి ఉన్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి వద్ద పదహారో నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడికి చెందిన బోడపాటి త్రిమూర్తులు (50) ఆదివారం రాత్రి నెల్లిపూడి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన బానుబోయిన స్వామి మోటార్ బైక్‌పై చెందుర్తి నుంచి అన్నవరం వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న త్రిమూర్తులును అతడు బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌పై ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీహరిబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు త్రిమూర్తులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
లోవలో భక్తుల రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవ స్థానం ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,48,360, పూజా టికెట్లకు రూ.1,49,250, తలనీలాలకు రూ. 12 వేలు, వాహన పూజలకు రూ.12,290, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.56,700, విరాళాలు రూ.24,855 కలిపి మొత్తం రూ.4,03,455 ఆదాయం లభించిందని వివరించారు.


