పాడికాని పాలన! | - | Sakshi
Sakshi News home page

పాడికాని పాలన!

Mar 9 2026 7:36 AM | Updated on Mar 9 2026 7:36 AM

పశువుల నుంచి సేకరిస్తున్న పాలను క్యాన్‌లో నింపుతున్న దృశ్యం

పశుపోషణపై ప్రభుత్వం శీతకన్ను

ప్రైవేటు డెయిరీలకు ప్రోత్సాహం

పాల ధర తగ్గి.. దాణా ధర పెరిగి..

పోషణ భారమై రైతు కుదేలు

జిల్లాలో ఏటా తగ్గుతున్న పశు సంపద

ఆలమూరు: పాడి పశువులు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో నేటి రైతులకు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పాల సేకరణపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ప్రైవేటు డెయిరీలు రైతులను గుప్పెట్లో పెట్టుకుని పాల ధర నియంత్రిస్తోంది. మరోవైపు పశువుల దాణా రాయితీలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తేయడంతో దాని ధర రోజు రోజుకూ పెరిగిపోయి రైతుకు పెను భారంగా మారింది. ఈ బాధలు పడలేక ఉన్న పశువులను అయినకాడికి అమ్ముకొని కూలిపనులే మేలని వెళ్లిపోతున్నారు. జిల్లాలో 2019 గణాంకాలతో పోలిస్తే 2025లో పశువుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.

గ్రాసం లేక.. దాణా పెరిగి..

జిల్లాలో ఒకప్పుడు వ్యవసాయం కంటే పాడి పరిశ్రమే లాభాల బాటలో నడిచేది. చంద్రబాబు సర్కార్‌ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల పాడిలో నష్టాలు వస్తున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఎండు ఉత్పత్తి లేదు. దీంతో ట్రాక్టర్‌ గడ్డి కొనాలంటే సుమారు రూ.12 వేలు ఖర్చు అవుతోంది. కాలువ గట్లు, పంట బోదెలు ఆక్రమణలతో పచ్చగడ్డి సైతం దొరకడం లేదు. వరికి గిట్టుబాటు ధర లేకపోయినా ధాన్యం నుంచి లభించే పశు దాణాకు ఉపయోగపడే చిట్టు, పారు, తవుడు ధరలు బహిరంగ మార్కెట్‌ లో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో రాయితీ పశుగ్రాస విత్తనాలు కాని, దాణా కాని ఇవ్వకపొవడం పాడి పరిశ్రమకు శాపంగా మారింది.

గతమెంతో ఘనం

గత వైఎస్సార్‌ సీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ పాడి పరిశ్రమ అభివృద్ధికి గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో ఆ సంస్థ ఆధునిక పరికరాలతో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యతను బట్టి లీటరు గేదె పాలు రూ.80 నుంచి రూ.100, ఆవు పాలు రూ.60 నుంచి రూ.80 వరకూ అందించే ఏర్పాటు చేసింది. అలాగే 2024 మే వరకూ ఆ సంస్థ పాల సేకరణ జరిపి రైతులకు అండగా నిలిచింది. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలను నిలిపివేసి ప్రైవేట్‌ డెయిరీలను ప్రోత్సహిస్తూ రైతుల లాభాలపై గండి కొట్టింది. గత ప్రభుత్వంలో 50 కేజీల బస్తా దాణా రూ.1100 ఉండగా ప్రస్తుతం రూ.1500 వరకూ చేరుకుంది. ఈ పరిస్థితుల్లో పశుపోషణ భారంగా మారి రైతు అవస్థ పడుతున్నాడు.

పశువైద్యం దూరం

పాడి పరిశ్రమ–పశుగణాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి వల్ల పశువైద్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 99 పశు వైద్యశాలలు ఉండగా, కొన్ని చోట్ల వైద్యుల కొరత ఉంది. చాలాచోట్ల ఇన్‌చార్జి వైద్యాధికారులే ఉండడంతో సేవలు సక్రమంగా అందడం లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పశువైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌, సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేవి.

జిల్లాలో పశు సంపద ఇలా

(2019–25 గణన ప్రకారం)

మూగ జీవాలు 2019 2025

ఆవులు 74,778 61,462

గేదెలు 1,53,542 1,20,539

గొర్రెలు 1,71,263 1,48, 349

మేకలు 69,265 62,456

పందులు 2,080 1,756

పౌల్ట్రీ కోళ్లు 2.14 కోట్లు 2.07 కోట్లు

ప్రయోజనం శూన్యం

పశుపోషణ వల్ల పాడిరైతుకు ప్ర యోజనం శూన్యం. పాల ధరలు పెరగకపోవడం అటుంచితే బహిరంగ మార్కెట్‌లో దాణా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ప్రభుత్వం రాయితీలు నిలిపివేయడంతో పశుపోషణ భారంగా మారింది. – గుణ్ణం రాంబాబు,

డైరెక్టర్‌, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పశుపోషకుల సంఘం,

గుమ్మిలేరు, ఆలమూరు మండలం

పశువుల దాణా భారం

పశువులకు దాణా కొనుగోలు చేయడం భారంగా మారింది. ఒక పశువు నుంచి పాల ద్వారా లభించే ఆదాయం కంటే మేత ఖర్చు అధికంగా ఉండటంతో పశువుల పెంపకాన్ని తగ్గించేస్తున్నాం. పాడిరైతులకు ఇచ్చే రాయితీలపై ప్రభుత్వం పునరాలోచించాలి.

– నెక్కంటి సూర్యప్రకాశరావు,

పాడిరైతు, పెదపళ్ల,

ఆలమూరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement