
శ్రీనివాసా.. గోవిందా..
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు
● ఒక్కరోజే రూ.66.21 లక్షల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వేకువజాము నుంచే ఆలయంలో రద్దీ ఏర్పడింది. భక్తులు గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు.
వైద్యశిబిరాలు
వాడపల్లి వెంకన్న క్షేత్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. పలువురు భక్తులు ఉపవాసాలతో నీరస పడి, స్వల్ప అస్వస్థతకు గురి కాగా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వయంగా వైద్య సేవలను పర్యవేక్షించారు. వారు కోలుకునే వరకు తగిన మందులు, టానిక్‌లు, ఓఆర్‌ఎస్‌లు ఇప్పించారు.
భారీగా ఆదాయం
వాడపల్లి దేవస్థానంలో స్వామివారి విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, నిత్యాన్నదానం, శాశ్వత అన్నదానం, లడ్డూ ప్రసాదం విక్రయం తదితర సేవల ద్వారా రాత్రి 8 గంటలకు రూ.66,21,466 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్‌ను నియంత్రించి, బందోబస్తును పర్యవేక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు తిరిగాయి.
బ్యాటరీ కార్ల సౌకర్యం
తిరుమల తరహాలో వాడపల్లి వెంకన్న క్షేత్రంలోనూ వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు బ్యాటరీ కార్ల సౌకర్యం కల్పించారు. భక్తులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, తక్కువ సమయంలో దర్శనం కల్పించేందుకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కార్లను ప్రవేశపెట్టారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెంకి చెందిన జేఎస్‌ఎన్ రాజు కనస్ట్రక్షన్ కంపెనీ వారు దేవస్థానానికి రూ. 12 లక్షల వ్యయంతో 2 బ్యాటరీ కార్లు సమర్పించిన విషయం తెలిసిందే. కొత్త పార్కింగ్ ప్రాంతం నుంచి ఆలయం వరకూ నడవలేని భక్తులను బ్యాటరీ కార్లలో తీసుకువెళ్లి, మళ్లీ పార్కింగ్ స్థలం వద్ద దించుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

శ్రీనివాసా.. గోవిందా..