
పోలీస్ గ్రీవెన్స్‌కు 29 అర్జీలు
అమలాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు 29 అర్జీలు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో పోలీస్ అధికారులు అశ్రద్ధ వహించవద్దని ఎస్పీ సూచించారు. అర్జీల్లో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఎస్పీ కృష్ణారావు వారితో చర్చించి, సమస్య పరిష్కార చర్యలు తీసుకున్నారు.
కలెక్టరేట్ వద్ద
వర్కింగ్ జర్నలిస్టుల నిరసన
అమలాపురం రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. జర్నలిస్ట్ డిమాండ్స్ డేను పురస్కరించుకుని సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సంఘ రాష్ట్ర కోశాధికారి, జిల్లా కన్వీనర్ మట్టపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు, ఉద్యోగ భద్రత, ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీహార్ తరహాలో ఇక్కడి జర్నలిస్టులకు రూ.15 వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు సంఘ ప్రతినిధులు పళ్ల సూర్యప్రకాశరావు, కడలి రాజు, హరి, బాబు తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, కడలి సూరిబాబు, పి.వెంకటేశ్వరరావు, రెడ్డిబాబు, ఆకుల సురేష్, భీమా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లి క్షేత్రంలో
పవిత్రోత్సవాలు ప్రారంభం
మూడు రోజుల పాటు విశేష పూజలు
కొత్తపేట: కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడపల్లి క్షేత్రంలో నిత్య, పక్ష, మాస, వార్షిక ఉత్సవాల్లో భాగంగా శ్రావణ శుద్ధ దశమి నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసం, దశమి తిథిని పురస్కరించుకుని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అ ర్చకులు, వేద పండితులు మూలవిరాట్ స్వామివారిని, ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. సంప్రదాయబద్ధంగా దీక్షాధారణ చేసి, శాస్త్రోక్తంగా పవిత్రోత్సవ వేడుకలను ప్రారంభించా రు. ఉదయం విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, రుత్విక్‌వరుణ, ఆకల్మషహోమం, నీరాజన మంత్రపుష్పాలు జరిపారు. సాయంత్రం మృతసంగ్రహణ, అంకురార్పణ, నవమూర్తి ఆవాహన, పంచగవ్యప్రోక్షణ, పంచ శయ్యాధివాసం, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
9న పీఠంలో శ్రావణ పౌర్ణమి
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 9న శ్రావణ పౌర్ణమి పూజలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, సామూహిక కుంకుమ పూజలు చేస్తారన్నారు. పీఠంలోని భవానిశంకర అష్టమ లింగేశ్వరస్వామికి ఏకవార రుద్రాభిషేకం, శ్రీదేవి భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామికి తులసిదళ అర్చనలు, నవగ్రహ, నక్షత్ర హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

పోలీస్ గ్రీవెన్స్‌కు 29 అర్జీలు

పోలీస్ గ్రీవెన్స్‌కు 29 అర్జీలు