
అంతర్వేది దేవస్థానం సాగు రైతుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డీఓ వసంతరాయుడు
● స్వామివార్ల భూముల స్వాహాపై
అమలాపురం ఆర్‌డీఓ సీరియస్
● బకాయిలు చెల్లించకుంటే
కౌలు రద్దు చేస్తామని హెచ్చరిక
సఖినేటిపల్లి: ‘స్వామివార్ల భూము లు స్వాహా’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల బకాయిలకు సంబంధించి రావాల్సిన బకాయిలపై అమలాపురం ఆర్‌డీఓ వసంతరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మీ నృసింహస్వామి, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానాల భూములను సాగు చేస్తున్న రైతులతో శిస్తులపై దేవస్థానం ప్రాంగణంలో శనివారం ఆయన సమీక్షించారు. ఈ దేవస్థానాలకు అంతర్వేది, శృంగవరప్పాడు, కేశవదాసుపాలెం, గొంది గ్రామాల్లో ఉన్న భూముల శిస్తుల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో పెంపుదలపై చర్చించారు. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి రూ.1,70,82,842, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి రూ.68,05,130 మేర బకాయిలున్న విషయాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ వివరించారు. ఈ గ్రామాల్లో 152.35 ఎకరాలను అనధికారికంగా రొయ్యల చెరువులుగా మార్చి, సాగు చేస్తున్న అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. లీజులు తక్కువగా ఉన్నా బకాయిలు చెల్లించకపోవడాన్ని ఆర్‌డీఓ తీవ్రంగా పరిగణించారు. దేవస్థానం భూములను ఇష్టానుసారం చెరువులుగా మార్చేసి, మట్టి కూడా అమ్ముకుని, దేవుడికి రూపాయి కూడా కట్టడం లేదని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోగా బకాయిలు చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు నెలల్లో సగం బకాయిలు చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని వాయిదాలపై చెల్లించాలని ఆదేశించారు. మొండికేస్తే కొత్తగా వేలం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆస్తులున్నా ఆశించిన రీతిలో ఆదాయం రాక.. స్వామివారి కల్యాణ మహోత్సవాలకు వేర్వేరు విధాలుగా డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితులు సరి కాదని అభిప్రాయపడ్డారు. మూడేళ్లకోసారి శిస్తులు పెంచాల్సి ఉందని, రైతులు కష్టాల్లో ఉండటంతో పెంపుదలను వాయిదా వేయాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కోరారు. దేవస్థానం భూముల్లో మట్టి అమ్మితే చట్టం ప్రకారం చర్యలు తప్పవని కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ హెచ్చరించారు.
