సంతృప్తిగా వెళుతున్నా: జస్టిస్‌ బాబ్డే

New Delhi: Cji Sa Bobde GoingTo Satisfactory Retire - Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే పదవీ విరమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఎంతో సంతృప్తిగా తాను పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ఎంతో సంతోషంతో, మధుర స్మృతుల్ని మూటగట్టుకొని, మంచి పేరు సంపాదించుకొని అత్యున్నత న్యాయస్థానాన్ని వీడుతున్నట్టు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తిగా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించడానికి శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నారు. ఎన్నో అద్భుతమైన వాదనలు విన్నానని, అంతకు మించి న్యాయం కోసం చిత్తశుద్ధితో పోరాటం సాగించిన వారిని చూశానని వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పుతో సహా ఎన్నో ముఖ్యమైన తీర్పులను జస్టిస్‌ బాబ్డే వెలువరించారు.

కోవిడ్‌–19 సంక్షోభం నెలకొన్నప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ చేపట్టారు. అయితే ఈ తరహా విచారణ తనలో చాలా అసంతృప్తిని మిగిల్చిందని జస్టిస్‌ బాబ్డే పేర్కొన్నారు. అందువల్ల తన పదవీ కాలం చివరి రోజుల్లో మిశ్రమ అనుభూతులే తనకు మిగిలాయని చెప్పారు.

48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం పదవీ ప్రమాణం చేయనున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ అత్యంత సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం కనీసం మూడు సంవత్సరాలైనా ఉండాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కోర్టులు మూతపడకుండా వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టి 50 వేల కేసుల్ని పరిష్కరించడం జస్టిస్‌ బాబ్డే వల్లే సాధ్యమైందని కొనియాడారు.

( చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా? )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top