రిపోర్టర్‌ కిడ్నాప్‌ కేసులో ఆసక్తికర విషయాలు..! 

Youtube Repoter Kidnap Case Investigating In Dundigal - Sakshi

హైదరాబాద్‌‌ : యూట్యూబ్‌ రిపోర్టర్‌ కిడ్నాప్‌ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతకొంత కాలంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులతో రిపోర్టర్లు మిలాఖతైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం తరలిస్తున్న వారిని బెదిరించి బంధించడంతోనే అజ్మత్‌ను కిడ్నాప్‌ చేసినట్లు సమాచారం. గురువారం మహ్మద్‌ ఇక్బాల్‌ దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.  సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌ ఇక్బాల్, అతని స్నేహితులు అప్ఫర్, నయీమ్, తౌఫిక్, ఆసిఫ్, జబ్బర్, ఫయాజ్‌లు గత కాలంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి కర్నాటకలో అధిక ధరలకు విక్రయిస్తుండేవారు. (తీన్మార్‌ మల్లన్న హద్దులు దాటాడు..)

ఇదే తరహాలో ఈ నెల 5న అఫ్సర్‌ తన డ్రైవర్‌ సిరాజ్‌తో కలిసి రోడామేస్ట్రీనగర్, జీడిమెట్లల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న యూట్యూబ్‌ రిపోర్టర్లు సలీమ్, అజ్మత్, అజర్, పర్వీజ్‌ అహ్మద్‌ లతో పాటు మరికొంత మంది ఆటోను అటకాయించారు. తమకు డబ్బులు ఇవ్వకుంటలే పోలీసులకు పట్టిస్తామని బెదిరించి ఇక్బార్‌ బావ ఇమ్రాన్‌ నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. అంతే కాక తమకు నెలనెలా రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు బియ్యాన్ని తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న అజ్మత్, సమీర్, సలీం, అజార్, నవీన్, శ్రీకాంత్‌లు అడ్డుకుని ఆటోలో ఉన్న సిరాజ్, హర్షద్‌లను గదిలో బంధించారు. ఆపై రూ.1 లక్ష ఇస్తేనే ఆటోను వదులుతామని బేరం పెట్టారు. వారిని విడిపించుకునేందుకు సలీం, అజ్మత్‌లు చెప్పిన కైసర్‌నగర్‌ చౌరస్తాకు ఇన్నోవా లో అక్కడికి చేరుకోగా యూట్యూబ్‌ రిపోర్టర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అజ్మత్‌ దొరకడంతో అతన్ని తాండూరుకు తీసుకెళ్లి మరోసటి రోజు వదిలిపెట్టారు. ఈ మేరకు ఇక్బాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

మరిన్ని కేసులు.. 
యూట్యూబ్‌ రిపోర్టర్లు అజ్మత్, సలీం, అజార్, నవీన్, శ్రీకాంత్, సమీర్, ఖయ్యూమ్‌లపై గతంలో కూడా పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా కొత్త నిర్మాణం చేపట్టినా, బోరు వేసినా వెళ్లి బెదిరించడం, అందిన కాడికి దండుకోవడం పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆ దిశగా కూడా పోలీసులు వీరి ఆగడాలపై దర్యాప్తు చేపట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top