ఉసురు తీసిన మద్యం మత్తు

Young Man Assassinated Paternal Uncle In Prakasam District - Sakshi

సాక్షి, ప్రకాశం: వారిద్దరు సొంత బంధువులు.. వరుసకు బాబాయి, కొడుకు అవుతారు.. మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని బీరు సీసా పగలకొట్టి గొంతుపై పొడవటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పెదారికట్ల వైన్‌ షాపు వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. పెదారికట్లకు దగ్గర్లోని కనిగిరి మండలం యడవల్లికి చెందిన కొత్త వెంకటేశ్వరరావు(48), కొత్త పుల్లారావు బంధువులు. ఇద్దరూ మద్యం తాగేందుకు పెదారికట్లలోని వైన్‌ షాపు వద్దకు వచ్చారు.

పూటుగా మద్యం తాగిన అనంతరం ఒకరికొకరు గొడవ పడ్డారు. కోపంతో రగిలిపోయిన పుల్లారావు తన బాబాయ్‌ వెంకటేశ్వరరావుపై బీరు సీసాతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు కొద్దిసేపటికి మృతి చెందాడు. మృతుడికి భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  బంధువులు సంఘటన స్థలానికి చేరుకొనే వరకు పుల్లారావు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లాడు. పొదిలి సీఐ సుధాకరరావు, ఎస్‌ఐ శివ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బంధువులతో మాట్లాడారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివ తెలిపారు. 

చదవండి: మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top