బ్రేకప్‌: ప్రియుడి కోసం మాంత్రికుడ్ని నమ్మి...

Young Girl Cheated By Occultist In Maharashtra - Sakshi

ముంబై : తన నుంచి విడిపోయిన ప్రియుడ్ని వెనక్కు రప్పించటానికి మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఓ యువతి దారుణంగా మోసపోయింది. అతడి మాయలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఖార్‌ఘర్‌కు చెందిన ఓ యువతికి కొన్ని నెలల క్రితం ప్రియుడితో బ్రేకప్‌ అయింది. ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పి, ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో అప్పటినుంచి మానసికంగా కృంగిపోయింది. ఇలాంటి సమయంలో రైలు బోగిలో అంటించిన పోస్టర్లను చూసింది. అవి ఓ మాంత్రికుడికి సంబంధించిన ప్రకటన పోస్టర్లు. తాను ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపుతానంటూ ఆ పోస్టర్‌ ప్రకటనలో పేర్కొన్నాడు ఆ మాంత్రికుడు. ఈ నేపథ్యంలో యువతి మాంత్రికుడు కరీమ్‌ ఖాన్‌ను ఆశ్రయించింది. ఆమె ప్రియుడ్ని వెనక్కు రప్పిస్తానని, ఇద్దరికీ పెళ్లి అయ్యేలా చేస్తానని నమ్మబలికాడు. అతడికి వచ్చే పెళ్లి సంబంధాలన్నీ చెడగొడతానని చెప్పాడు.

ఇందుకోసం మీరట్‌ దర్గాలో కొన్ని పూజలు చేయాలని చెప్పి, ఆమె వద్దనుంచి 4.57 లక్షల రూపాయలు వసూలు చేశాడు.  డబ్బులు కట్టి రోజులు గడుస్తున్నా యువతి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులను ఆశ్రయిస్తే క్షుద్రపూజల ద్వారా ఆమెను రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయేలా చేస్తానని భయపెట్టాడు. అయినప్పటికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top