బెజవాడలో వ్యాపారి హత్య | Sakshi
Sakshi News home page

బెజవాడలో వ్యాపారి హత్య

Published Fri, Aug 20 2021 2:03 AM

Young businessman was brutal Assassination in Vijayawada - Sakshi

గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడలో యువ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు. కారులోనే అతడి గొంతుకు తాడుబిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. బుధవారం రాత్రి ఇంటివద్ద నుంచి బయటకు వెళ్లిన కరణం రాహుల్‌ (30) గురువారం  బందరు రోడ్డులో కారులో మృతదేహంగా కనిపించారు. ఒంగోలుకు చెందిన రాహుల్‌ ప్రస్తుతం కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని ఒక విల్లాలో ఉంటున్నారు. జి.కొండూరులో జిక్సిన్‌ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట స్నేహితుడు కోరాడ విజయ్‌కుమార్‌తో కలిసి 2016 నుంచి గ్యాస్‌ సప్లయ్‌ వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని ఎం.సి.పల్లె వద్ద సుమారు రూ.57 కోట్లతో జిక్సిన్‌ గ్యాస్‌ సిలిండర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో కారులో రాహుల్‌ ఇంటి వద్ద నుంచి బయటకెళ్లారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో గురువారం కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఇంతలో బందరురోడ్డులో కారులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లిన రాహుల్‌ తండ్రి రాఘవరావు, భార్య పూర్ణిమ.. ఆ మృతదేహం రాహుల్‌దని గుర్తించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రాహుల్‌ను విజయకుమార్‌ హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్‌ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 

ఆధారాల సేకరణ
డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లు హత్య జరిగిన కారు నుంచి కొన్ని ఆధారాలు సేకరించాయి. రాహుల్‌ డ్రైవింగ్‌ సీటులో కూర్చుని ఉండగా, తల వెనక్కి నెట్టబడి ఉంది. కుడిచేతి భుజం వద్ద రక్తపు మరకలున్నాయి. డ్రైవర్‌ పక్క సీటులో నైలాన్‌ తాడు, రాహుల్‌ ముఖంపై దిండు ఉన్నాయి. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్, అతడి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. 

కారే కీలక ఆధారం
రాహుల్‌ ఫోర్డ్‌ ఎండీవర్‌ టాప్‌ ఎండ్‌ మోడల్‌ కారు వాడుతున్నారు. కారు ఎక్కడి నుంచి బయల్దేరింది.. ఎక్కడ ఆగింది.. ఎంత వేగంతో వచ్చింది.. బ్రేక్‌లు ఎప్పుడు వేసింది.. వంటి అంశాలను కారులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకునే వీలుంది. కారులో పెనుగులాట జరిగినా అందులో ఉన్న సెన్సిటివ్‌ సెన్సార్ల ద్వారా ఆ డేటా నిక్షిప్తం అవుతుంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement