కానిస్టేబుల్‌ పేరుతో మహిళ మోసం

Woman Cheated In The Name Of Constable - Sakshi

కరప(తూర్పుగోదావరి): టిప్‌టాప్‌గా ముస్తాబై, స్కూటర్‌పై దర్జాగా వచ్చి, దుస్తులు కొనుగోలు చేసి, కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్‌ని అని చెప్పి అరువు పేరుతో ఉడాయించింది ఓ మహిళ. పోలీసు పేరుతో వ్యాపారికి టోకరా ఇచ్చిన ఘటన కరపలో చోటుచేసుకుంది. బాధిత వ్యాపారి నక్కా శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కరప గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాస్‌ డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో రెడీమేడ్‌ వస్త్ర దుకాణంతో స్వయం ఉపాధి కల్పించుకున్నాడు. రెండు వారాల క్రితం ఆ దుకాణానికి ఒక మహిళ వచ్చి యజమానితో ఆకర్షణీయంగా మాట్లాడి, రూ.3,300 విలువ చేసే దుస్తులు తీసుకుంది. వ్యాపారి సొమ్ములు అడగగా కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చానని, రేపు డ్యూటీకి వచ్చినప్పుడు తీసుకువచ్చి, ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పింది.

ఆ వ్యాపారి ఆమె మొబైల్‌ నంబరు, ఇవ్వాల్సిన బాకీ బుక్‌లో నోట్‌ చేసుకున్నాడు. వచ్చిన స్కూటర్‌ నంబరు కూడా (ఏపీ 05 డీసీ, 9813) నోట్‌ చేసుకున్నాడు. రెండు వారాలవుతున్నా బాకీ ఇవ్వకపోవడంతో తనకిచ్చిన మొబైల్‌ నంబరు 9849700844కు ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. కరప స్టేషన్‌లో అడిగితే అటువంటి వారు ఇక్కడ పని చేయడంలేదని చెప్పడంతో మహిళ చేతిలో మోసపోయినట్టు గ్రహించి, లబోదిబోమంటున్నాడు. కరప ఎస్సై డి.రామారావును వివరణ కోరగా బాధితుడు నుంచి ఫిర్యాదు రాలేదన్నారు. మొబైల్‌ నంబర్‌ను ఆరా తీయగా ఉపేంద్ర అనిల్‌కుమార్‌ పేరుపై తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా చిరునామాతో ఉందని, స్కూటర్‌ నంబర్‌ ప్రకారం ఏసుబాబు బాలి, ఏలేశ్వరం పేరున రిజిస్టర్‌ అయి ఉన్నట్టు కరప ఎస్సై తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top