Aryan Khan: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?

Witness says NCB official demanded Rs 25 cr from Shah Rukh Khan to release son - Sakshi

ముంబై డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు 

షారూక్‌ నుంచి ఎన్‌సీబీ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేశారు 

ఖాళీ కాగితాలపై సంతకాలు చేయమని నాపై ఒత్తిడి తెచ్చారు

ప్రభాకర్‌ సాయిల్‌ అనే సాక్షి సంచలన ఆరోపణలు 

అఫిడవిట్‌ దాఖలు, సోషల్‌ మీడియాలోనూ వీడియో విడుదల

ముంబై: ముంబై క్రూయిజ్‌ మాదక ద్రవ్యాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్‌ కుదిరిందని ప్రభాకర్‌ సాయిల్‌ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్‌ తాను సమర్పించిన అఫిడవిట్‌లో ఆరోపించారు.

ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి చెప్పారు. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్‌ అక్టోబర్‌ 2న క్రూయిజ్‌ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్‌సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్‌ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్‌ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్‌లో ఈ డీల్‌ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్‌ మేనేజర్‌ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్‌ గురించి 15 నిముషాల సేపు చర్చించారంటూ ప్రభాకర్‌ తెలిపారు.

ఎన్‌సీబీ అధికారులు తనని తొమ్మిది నుంచి 10 ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. మరోవైపు కేపీ గోసవితో ఆర్యన్‌ ఖాన్‌ దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం, అతనిపై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఈ కేసు ఇంకా అనూహ్య మలుపులు తిరగడం ఖాయంగా అనిపిస్తోంది. అక్టోబరు 3న అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం ముంబైలోని అర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతని బెయిల్‌ పిటిషన్‌ మంగళవారం బాంబే హైకోర్టులో విచారణకు రానుంది.

గట్టి జవాబు ఇస్తాం: సమీర్‌  
ప్రభాకర్‌ సాయిల్‌ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఎన్‌సీబీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే తోసిపుచ్చినట్టుగా ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాంఖెడే హెచ్చరించారు. సాక్షి అడ్డం తిరిగాడని, ఎన్‌సీబీ ప్రతిష్టను మంట కలిపేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అలాంటి మీటింగ్‌లేవీ జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభాకర్‌ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఎన్‌సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రభాకర్‌ ఈ కేసులో సాక్షి మాత్రమే. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఆయన చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో చెప్పుకునే బదులు న్యాయమూర్తి సమక్షంలోనే తన గోడు చెప్పుకోవాల్సింది. అతని అఫిడవిట్‌ను ఎన్‌సీబీ డైరెక్టర్‌ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది.

మహారాష్ట్ర పరువు తీస్తారా?: శివసేన ఫైర్‌
ఆర్యన్‌ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ ముడుపులు డిమాండ్‌ చేసిందన్న ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయని శివసేన సీనియర్‌ నాయకుడు సంజయ్‌ రౌత్‌ అన్నారు. మహారాష్ట్ర పరువు తీయడానికే ఈ కేసులు పెట్టారని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే భావిస్తున్నారని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటుగా సంజయ్‌ రౌత్‌ ఒక వీడియో క్లిప్పింగ్‌ షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఎన్‌సీబీ కార్యాలయంలో గోసవి ఫోన్‌ చేతిలో పట్టుకొని (స్పీకర్‌ ఆన్‌ చేసి) ఉండగా... ఆర్యన్‌ ఖాన్‌ ఎవరితోనో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని రౌత్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు నవాబ్‌ మాలిక్‌ ఎన్‌సీబీ జోనల్‌ చీఫ్‌ సమీర్‌ వాంఖెడేపై సిట్‌తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీబీపై తరచుగా విమర్శలు చేస్తోంది.


నాపై కుట్ర జరుగుతోంది: పోలీసుల్ని ఆశ్రయించిన వాంఖెడే
తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్‌సీబీ ముంబై జోనల్‌ చీఫ్‌ సమీర్‌ వాంఖెడే ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలంటూ నగర పోలీసు కమిషర్‌ హేమంత్‌ నగ్రాలేకి లేఖ రాశారు. ‘‘ముడుపుల ఆరోపణలకు సంబంధించి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ముత్తా అశోక్‌ ఈ అంశాన్ని ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ పరిశీలనకు పంపారు. దురద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలి’’ అని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top