అడ్వొకేట్‌ అరాచకం 

Wife under house arrest for 11 years - Sakshi

11 ఏళ్లుగా భార్య గృహనిర్బంధం 

సెర్చ్‌ వారెంట్‌తో మహిళను విడిపించిన పోలీసులు 

విజయనగరం (క్రైమ్‌): నలుగురికీ న్యాయం చేయా­ల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురిచేశాడు. 11 ఏళ్లపాటు భార్యను బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులను ఆ­శ్రయించారు. ఎస్పీ ఎం.­దీపికను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులపైనా కేసు పెడతానంటూ న్యాయవాది బెదిరించడంతో చేసేది లేక మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్‌ వారెంట్‌తో వెళ్లి గృహ నిర్బంధం నుంచి ఆమెను విడిపించారు.

సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంటోన్మెంట్‌ బాలాజీ మార్కెట్‌ సమీపంలోని మార్వాడి వీధిలో ఉంటున్న న్యాయవాది గోదారి మధుసూదనరావు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్నాడు. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ ఆ తరువాత భర్త దగ్గరకు వచ్చేందుకు నిరాకరించింది. నువ్వు లేకపోతే ఉండలేనంటూ భర్త చెప్పిన మాయమాటలు నమ్మి విజయనగరం వచ్చింది. అప్పటినుంచి భార్యను ఇంట్లోనే బంధించిన మధుసూదనరావు తల్లిదండ్రులతో మాట్లాడటానికి, చూడటానికి కూడా అనుమతించలేదు.

ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా బయటినుంచే పంపించేసేవాడు. ఇలా 11 ఏళ్లపాటు ఈ తంతు సాగింది. దీంతో తమ కుమార్తె సుప్రియ అసలు బతికి ఉందో లేదోనని అనుమానించిన తల్లిదండ్రులు  కన్నీటిపర్యంతమవుతూ వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మీరు దొంగపోలీసులని, ఎఫ్‌ఐఆర్‌ ఉంటేనే రావాలని చెప్పి లోపలికి రానీయలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎస్పీ ఎం.దీపికను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు రిజిస్టర్‌ చేసిన పోలీసులు కోర్టునుంచి సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని బుధవారం  ఆ ఇంటికి వెళ్లి  మహిళను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు.

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top