
ప్రేమికుడు, కిరాయి హంతకుని సాయంతో భర్తను చంపిన భార్య
పెళ్లయిన 2 వారాలకే దారుణం
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన రెండు వారాలకే ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భర్తను చంపించిందో భార్య. ఒకే గ్రామానికి చెందిన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ప్రగతి కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా మార్చి ఐదో తేదీన దిలీప్ యాదవ్‌తో వివాహం జరిపించారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న ప్రగతి ఎలాగైనా దిలీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనురాగ్‌తో కలిసి దిలీప్‌ను హతమార్చాలని పథకం వేసింది. ఈ హత్యకు ఏర్పాట్లు చేయడానికి అనురాగ్‌కు ప్రగతి రూ .1 లక్ష ఇచ్చింది.
రాంజీ అనే కిరాయి హంతకుడిని ఈ పని కోసం రూ.2 లక్షలకు నియమించుకున్నారు. దిలీప్ మార్చి 19వ తేదీన పని మీద కన్నౌజ్ జిల్లాకు వెళ్లి తిరిగొస్తూ పట్నా కెనాల్ సమీపంలో ఓ హోటల్ వద్ద ఆగాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దిలీప్ వద్దకొచ్చి తమ బైక్ పాడైందని, సాయపడాలంటూ దిలీప్‌ను తమ ఇంకో బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దిలీప్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పొలంలో పడేసి పరారయ్యారు.
దిలీప్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా అప్పటికే పరిస్థితి విషమించడంతో మూడు రోజుల తర్వాత అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలి సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తుల దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి సాయంతో కిరాయి హంతకుడు రాంజీని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచా రంతో అనురాగ్, ప్రగతిని అదుపులోకి తీసుకున్నారు.