ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్‌.. అధికారులే షాక్‌!

US Man Caught With Snakes Lizards In His Trousers Faces Jail - Sakshi

వాషింగ్టన్‌: పాముల వంటి విష జీవులను తాకేందుకే భయంతో వణికిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన దుస్తుల్లో దాచిపెట్టి వాటిని స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. ఇటీవలే తన ప్యాంటులో 60 రకాల పాములు, బల్లులు, ఇతర సరిసృపాలను దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేస‍్తుండగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికా- మెక్సికో సరిహద్దులో వెలుగు చూసింది. 7,50,000 డాలర్ల విలువైన సరిసృపాల స్మగ్లింగ్‌లో భాగంగా ప్యాంటులో దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. 

దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జోస్‌ మాన్యుయెల్‌ పెరెజ్‌ అనే వ్యక్తి ఆరేళ్లలో 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి అమెరికాకు స్మగ్లింగ్‌ చేసినట్లు చెప్పారు అధికారులు. నిరాటంకంగా సాగుతున్న అతడి అక్రమ రవాణా ఈ ఏడాది మార్చిలో బట్టబయలైంది. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అయితే, ముందు తన పెంపుడు బల్లులను తీసుకెళ్తున్నాని కస్టమ్స్‌ అధికారులకు తెలిపాడు. కానీ, అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించగా ప్యాంటులో 60 పాములు, బల్లుల వంటివి బయపడినట్లు అధికారులు తెలిపారు.

కోర్టు విచారణ సందర్భంగా తన స్మగ్లింగ్‌పై ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు నిందితుడు జోస్‌ పెరెజ్‌. కొన్నిసార్లు గాడిదలపై తరలించేందుకు డబ్బులు చెల్లించానని, ఇతర సమయాల్లో తానే సరిహద్దులు దాటానని ఒప్పుకున్నాడు. అతడు అక్రమ రవాణా చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు పత్రాలు సమర్పించారు అధికారులు. అందులో యుకాటాన్‌ బాక్స్‌ తాబేళ్లు, మెక్సికన్‌ బాక్స్‌ తాబేళ్లు, పిల్ల మొసళ్లు, మెక్సికన్‌ పూసల బల్లులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. రెండు కేసుల్లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

ఇదీ చదవండి: ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్‌ రికార్డులు పట్టేశాడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top