ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది.. కానీ

Unemployed Girl Suicide - Sakshi

సాక్షి, గుడిహత్నూర్‌(ములుగు): తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ ఆమెను ఉన్నత చదువు చదివించారు. డయాలసిస్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పూర్తి చేసింది. ఇటీవల ఆర్మీలో నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది. పరీక్ష కోసం కష్టపడి చదివింది. రెండు నెలల క్రితం పరీక్ష రాసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఇంకా ఫలితాలు వెలువడలేదు. ఫలితాలు వస్తే తనకు జాబ్‌ వస్తుందో రాదో అని మనస్తాపం చెందింది. (చదవండి: వారసుడొచ్చాడని ఆనందపడ్డారు.. కానీ వారం రోజుల తర్వాత.. )

ఒత్తిడి భరించలేక సోమవారం ఉరేసుకుంది. ఈ ఘటన గుడిహత్నూర్‌ మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి జరిగింది. ఏఎస్సై రెహమాన్‌ఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన ముస్కాన్‌(21) తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముస్కాన్‌కు చదువుపై ఆసక్తి ఉండడంతో ఇంటర్‌ పూర్తయిన వెంటనే డయాలసిస్‌ టెక్నీషియన్‌ కోర్సు చదివించారు. ఇటీవల ఆర్మీలో నర్సింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసుకుని పరీక్ష కూడా రాసింది. ఫలితాలు రావడం ఆలస్యం అవుతుండడంతో కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటోంది. సోమవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బంధువులు వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తండ్రి షేక్‌ హరూన్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. హరూన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top