మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల

Two young men dead in road accident - Sakshi

వెంగళాయపాలెంలో విగ్రహం దిమ్మెను ఢీకొన్న కారు 

ఇద్దరు యువకుల దుర్మరణం

రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం

గుంటూరు రూరల్‌: మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాల్ని బలిగొంది. కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్‌ సాదిక్‌ (18) గుంటూరు రూరల్‌ మండలంలోని వెంగళాయపాలెంలో బంధువుల ఇంట జరిగిన వివాహానికి రెండు రోజల కిందట కారులో వచ్చాడు. వివాహ అనంతరం కార్యక్రమాలు చూసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి కాకుమాను వెళదామనుకున్నాడు. ఈలోగా మధ్యాహ్నం బంధువుల ఇంట్లోకి కొన్ని వస్తువులు అవసరమవ్వడంతో వాటిని తీసుకొచ్చేందుకు బేగ్‌ ఖాదర్‌ నాగుల్‌ బాషా (15), పఠాన్‌ లాలు (19)లతో కలసి కారులో బయలుదేరాడు. ఇందులో పఠాన్‌ లాలు కారును నడుపుతున్నాడు. మితిమీరిన వేగంతో వెళుతూ వెంగళాయపాలెంలోని జగ్జీవన్‌రామ్‌ సెంటర్‌లో రోడ్డు పక్కన ఉన్న విగ్రహం దిమ్మెను బలంగా ఢీకొట్టాడు.

ప్రమాదంలో ఖాదర్‌ నాగుల్‌ బాషా, సాదిక్‌లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా లాలుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఓ యువకుడి తలతెగి రోడ్డుపై పడిందంటే ఎంత వేగంగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదంలో మృతి చెందిన నాగుల్‌ బాషా తండ్రి మహమ్మద్‌ బేగ్‌. ఆయన ముగ్గురు కుమారుల్లో రెండోవాడైన బాషా 9వ తరగతి చదువుతున్నాడు. తనయుడు మృత్యువాతకు గురవ్వడం చూసి ఆయనతో పాటు కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. మృతి చెందిన సాదిక్‌ను చూసేందుకు సైతం తండ్రి మస్తాన్‌వలి తల్లడిల్లిపోయారు. ప్రమాదంలో కారును నడుపుతున్న లాలుకు గతంలో ఇటువంటి ప్రమాదం జరిగి ఒక కాలును కూడా కోల్పోయాడని సమాచారం. జైపూర్‌ ఫుట్‌తో కారును నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాల్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top