బంగారంలాంటి భర్త... ముత్యాల్లాంటి పిల్లలు అయినా...

Two Life Ends On Railway Track In Guntakal - Sakshi

బంగారం లాంటి భర్త... ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చక్కని సంసారం... సుఖసంతోషాల జీవితం కానీ ఆమె దారి తప్పింది... అన్నలాంటి వాడికి దగ్గరయింది.
ప్రేమను పంచే భార్య...అనురాగానికి ఇద్దరు పిల్లలు చిన్న కుటుంబం...చింతలేని సంసారం కానీ సోదరి జీవితంలోకి ‘అక్రమ’ంగా ప్రవేశించాడు. తప్పని తెలిసీ వారిద్దరూ తప్పటడుగు వేశారు  సమాజానికి భయపడి...ముఖం చూపలేక వెళ్లిపోయారు రైలు పట్టాలపై జీవితాలను ముగించేశారు వారి పిల్లలకు జీవితానికి సరిపడు శోకాన్ని మిగిల్చారు ఒక్క తప్పుడు నిర్ణయం..ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో..ఎంతమందిని క్షోభ పెడుతుందో తెలియజెప్పే ఈ సంఘటన గురువారం గుంతకల్లులో చోటుచేసుకుంది.

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి (38), గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి (40) వరుసకు అన్నాచెల్లెళ్లు. గురువారం గుంతకల్లు శివారులోని హనుమాన్‌ సర్కిల్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివారెడ్డి తనకు సోదరిలాంటి రాజ్యలక్ష్మీతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈక్రమంలో వారం కిందట వీరి విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో కుటుంబీకులకు ముఖం చూపించడం ఇష్టంలేక వారిద్దరూ మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.

భార్య కనిపించడం లేదని రాజ్యలక్ష్మి భర్త నారాయణస్వామి గుంతకల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి తన భార్యకు ఫోన్‌ చేసిన శివారెడ్డి... తానిక ఇంటికి రాలేనని... ఇవే తన చివరి మాటలని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత ఆ ఫోన్‌ కూడా పనిచేయలేదు. తీరా గురువారం రాజ్యలక్ష్మి, శివారెడ్డి మృతదేహాలు హనుమాన్‌ సర్కిల్‌ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమై కనిపించాయి.

స్థానికుల సమాచారంతో జీఆర్పీ సీఐ నగేశ్‌బాబు, ఎస్‌ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు విషయం చేరవేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోలీసులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా రాజ్యలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం కాగా, శివారెడ్డికి కూతురు, కొడుకు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top