Gouri lankesh Assassination Case: ఐదేళ్ల తరువాత నిరవధిక విచారణ

The Trial In Murder Case Of Journalist Gaurilankesh Set Resume - Sakshi

బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్య కేసులో విచారణ పునఃప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల కిందట... సెప్టెంబరు 05, 2017 రాత్రి గౌరీలంకేశ్‌ ఆఫీసు నుంచి రాజరాజేశ్వరినగరలో ఇంటికి చేరుకున్న సమయంలో దుండగులు ఆమెను పిస్టల్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులు ఉన్నారు. కుట్రదారు అమోల్‌ కాళే, కాల్పులు జరిపిన పరశురామ్‌ వాగ్మోరా, బైక్‌ నడిపిన గణేశ్‌ మిస్కిన్‌ తో పాటు 17 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వీరి తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు వాదిస్తున్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తిచేసి పలు చార్జిషీట్లను దాఖలు చేశారు.  మతాన్ని కించపరచడమే హత్యకు కారణంగా ప్రకటించారు.

ప్రతి రెండోవారంలో ఐదు రోజులు  
కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కర్ణాటక నేరాల నియంత్రణ చట్టం (కేసీఓసీఏ– కోకా) కోర్టు న్యాయమూర్తి సీఎం.జోషి శనివారం మార్గదర్శకాలను నిర్ణయించారు. విచారణ కొన్ని వారాల పాటు జరుగుతుంది. నెలలో ప్రతి రెండోవారంలో ఐదురోజుల పాటు విచారిస్తారు. తొలుత జూలై 4 నుంచి జూలై 8 వరకు వాదనలు నిర్వహిస్తామని న్యాయమూర్తి జోషి తెలిపారు.  

వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో  
భౌతికస్థితిలోనే విచారణ జరపాలని నిందితుల తరఫు లాయర్లు కోరగా, జడ్జి ఏకీభవించలేదు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ సాగుతుందని తెలిపారు. నిందితులు కొందరు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో, మరికొందరు ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలులో ఉన్నారు. న్యాయవాదులు నిందితులను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చని జడ్జి సూచించారు.  

(చదవండి: ట్రాఫిక్‌ జామ్‌పై నెటిజన్‌ వింత పోస్ట్‌.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top